దేశంలో 150 దాటిన ఒమిక్రాన్ కేసులు: కొత్తగా మహారాష్ట్రలో అత్యధికం
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, మహారాష్ట్రలో నమోదైన ఆరు కొత్త కేసులతో కలిపి ఆదివారం నాటికి దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 151కి చేరింది. 11 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 54 కేసులు వెలుగు చూశాయి.
ఆ తర్వాత ఢిల్లీలో అత్యధికంగా 22, తెలంగాణలో 20, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, గుజరాత్‌లో 9, పంజాబ్‌లో 1, తమిళనాడులో 1, పశ్చిమబెంగాల్‌లో 1, ఏపీలో 1 నమోదయ్యాయి.
ఢిల్లీలో జూన్ 27 తర్వాత ఆదివారంనాడే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 107 కరోనా కేసులు ఆదివారం నమోదు కాగా, జూన్ 27 నుంచి ఒక్కరోజులో ఢిల్లీలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికంగా కావడం గమనార్హం. ఇక మహారాష్ట్రలో కూడా ఆదివారం 902 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, మనదేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... గత 24 గంటల్లో కొత్తగా 7,081 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 264 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,40,275 కు చేరుకుంది.
రికవరీల సంఖ్య 3,41,78,940 కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4,77,422 కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83,913 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. . గత 24 గంటల్లో 76,54,466 మందికి టీకా వేయగా... ఇప్పటి వరకు 1,37,46,13,252 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications