దేశంలో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు: 109కి జేఎన్.1 వేరియంట్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. కోవిడ్ సాధారణ కేసులతోపాటు కొత్త వేరియంట్ కేసులు కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 529 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4093కు చేరుకున్నట్లు పేర్కొంది. మరోవైపు, కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వైరస్ కేసులు మంగళవారం నాటికి 101కి పెరిగాయి.
కాగా, గత 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కాగా, ఒకరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 26 వరకు దేశంలో మొత్తం 109 కొవిడ్ ఉపరకం జేఎన్.1 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో గుజరాత్ నుంచి 36, కర్ణాటక- 34, గోవా- 14, మహారాష్ట్ర- 9, కేరళ- 6, రాజస్థాన్- 4, తమిళనాడు- 4, తెలంగాణ నుంచి 2 కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కరోనా కేసులతోపాటు మరణాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షలు పెంచాలని, బాధితులకు అవసరమైన చికిత్సను అందించాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. కరోనాకు సంబంధించి ఇప్పటికే పలు కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ వేసుకోవాలని కోరింది. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించడం, పరిశుభ్రత విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలని సిఫార్సు చేసింది. పలు రాష్ట్రాలు కూడా మాస్కులను తప్పనసరి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications