స్వాతంత్య్ర దినోత్సవం వేళ - ప్రధాని వరుసగా 9వసారి : కీలక ప్రకటనలు ఉంటాయా..!!
ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేకత ఉంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది. రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఇందుకోసం సిద్దంగా ఉంది. ప్రధాని మోదీ వరుసగా 9వ సారి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహించింది. వజ్రోత్సవాలను కేంద్రప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.

నేటి ఉత్సవాలకు ప్రత్యేకత
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో యావత్ భారతం కదిలింది. అన్నివర్గాల ప్రజలు మువ్వన్నెల జెండా చేతబూని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. తమ దేశ భక్తిని చాటుకుంటున్నారు. ప్రతీ ఇంటి మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి చేసే ప్రతీ ఏటా ప్రసంగంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఈ సారి వజ్రోత్సవాల వేళ ప్రధాని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు
ఈ ఎనిమిదేళ్ల కాలంలో తన ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించటంతో పాటుగా భవిష్యత్ ప్రణాళికలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. గత ఏడాది ఎర్రకోట నుంచి ప్రధాని తన ప్రసంగంలో ముఖ్యంగా గతిశక్తి మాస్టర్ ప్లాన్, 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈసారి 100 ఏళ్ల స్వాతంత్య్ర భారత లక్ష్యాలు, ఆత్మ నిర్భర భారత్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఇక, ఈ రోజు ప్రధాని తన ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది చూడాల్సి ఉంది. ఇదే సమయంలో ఎర్రకోటతో పాటుగా దేశ వ్యాప్తంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా దళాలతో శత్రు దుర్భేద్యంగా మార్చారు.

పటిష్ఠ భద్రత ఏర్పాటు
వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
4 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్‌లను గుర్తించి, నేలకూల్చేలా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు సెంట్రల్ దిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. దిల్లీలో పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్ క్రాప్ట్‌లపై 24 గంటల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications