ట్రంప్ మాటే నెగ్గింది- అమెరికాతో భారత్ బిగ్ డీల్
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై ఇప్పటికే 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది.
ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.

ఈ పరిణామాల మధ్య అమెరికాతో భారత్ ఓ భారీ డీల్ ను కుదుర్చుకుంటోంది. దీని విలువ ఒక బిలియన్ డాలర్ల పైమాటే. రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందం ఇది. ఇందులో భాగంగా 97 తేజస్ ఎల్సీఏ మార్క్ 1ఏ జెట్స్ కు అవసరమైన 113 జీ-404 ఇంజిన్లను కొనుగోలు చేస్తుంది కేంద్రం. ఈ ఇంజిన్ల సరఫరా ద్వారా సాయుధ దళాలకు విమానాలు సకాలంలో అందేలా ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే మార్క్ 1ఏ జెట్ల కోసం 99 GE-404 ఇంజిన్లను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అదనంగా మరో బిలియన్ డాలర్ల వ్యయంతో కొత్త డీల్ ను కుదుర్చుకుంటోంది. దీనికి సంబంధించిన చర్చలు దాదాపుగా ముగింపు దశకు వచ్చాయి. సెప్టెంబర్ మొదటి వారం నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
ఈ ఇంజిన్లన్నీ కూడా హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అందజేస్తుంది అమెరికా. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటోన్న తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్ ను తయారు చేస్తోంది హెచ్ఏఎల్. వీటికి ఈ ఇంజిన్లను అమర్చుతుంది. ఇంజిన్ల సరఫరాలో ఎటువంటి జాప్యం ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది.
ఈ ఇంజిన్ల సరఫరా హెచ్ఏఎల్ కు అత్యవసరం. 2029-30 నాటికి.. రక్షణ మంత్రిత్వ శాఖకు 83 తేలికపాటి యుద్ధ విమానాలను అందించాల్సిన బాధ్యత ఈ సంస్థపై ఉంది. అలాగే.. 2033-34 నాటికి మరో 97 విమానాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్ సంస్థ జీఈతో కేంద్రం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది.
ప్రతి నెలా రెండు చొప్పున ఇంజిన్లను సరఫరా చేసేలా ఈ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ కు అవసరమైన 200 జీఈ-414 ఇంజిన్ల సరఫరాకు కూడా డీల్ కుదిరే అవకాశం ఉంది.
పాతబడ్డ మిగ్-21 వార్ క్రాఫ్ట్ లను తొలగించి, వాటి స్థానంలో తేజస్ యుద్ధ విమానాలను భర్తీ చేయాలని వైమానిక దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ కొత్త తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేస్తోంది. దీనికి అవసరమైన ఇంజిన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది.












Click it and Unblock the Notifications