స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం రివ్యూ- ట్యాక్స్ కట్
ఇదివరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 15 రోజుల వ్యవధిలో వీటి రేట్లు రూ. 7.50 పైసల వరకు ఎగబాకాయి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు సైతం వీటికి తోడయ్యాయి అప్పట్లో. రేటు విషయంలో ఈ మూడింటి మధ్య పెద్ద తేడా ఉండట్లేదు. ఇక ముందు పెరగకపోవచ్చనే గ్యారంటీ లేదు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు మళ్లీ పెరగొచ్చనే వాదనలు లేకపోలేదు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ తో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై ఎగుమతి ట్యాక్స్ ను మరింత తగ్గించింది. 15 రోజుల పాటు అంటే.. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ తగ్గుదల కొనసాగుతుంది. అంతర్జాతీయ ఇంధన ధరల ఆధారంగా కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి 15 రోజులకోసారి నిర్వహించే సమీక్ష సందర్భంగా పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ డ్యూటీని సవరించింది. దేశీయ ఇంధన పన్నుల్లో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుండి ప్రారంభం అయ్యే మలి 15 రోజులకు ఈ తగ్గింపులు వర్తిస్తాయి. డీజిల్ ఎగుమతులపై ప్రతి లీటరుకు విండ్‌ఫాల్ ట్యాక్స్ రూ. 25.5 నుండి రూ. 24 కు తగ్గింది. ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై పన్ను లీటరుకు రూ. 22 నుండి రూ. 19.5 పైసలకు తగ్గించారు. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 3.50 పైసలుగా ఉన్న ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేశారు. దీంతో పెట్రోల్ ఎగుమతులపై జీరో ట్యాక్స్ పడింది.
ఈ పన్నుల తగ్గింపు విదేశాలకు ఎగుమతి చేసే ఇంధన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అవి యధాతథంగా కొనసాగుతున్నాయి. ఈ పన్నుల సవరణతో లభించే తక్షణ ప్రయోజనం చమురు శుద్ధి సంస్థలు, ఎగుమతిదారులకు మాత్రమే పరిమితం. పెట్రోల్ ఎగుమతులపై విధించే డ్యూటీ.. పూర్తిగా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంగా వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ఈ ఎగుమతి సుంకాలను ఈ ఏడాది మార్చి 27న ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సగటు ధరల ఆధారంగా ప్రతి పక్షంరోజులకు ఈ రేట్లను సమీక్షిస్తారు. జులై నాటి సమీక్షలో పెట్రోల్‌పై ఎగుమతి సుంకం లీటరుకు రూ. 3, డీజిల్‌పై రూ. 16.5, ఏటీఎఫ్‌పై రూ. 16గా ఖరారు చేశారు. ముడిచమురు ఉత్పత్తిదారులు, ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును మొదటిసారిగా 2022లో విధించింది కేంద్రం.













Click it and Unblock the Notifications