బిజెపిపై నిఘా: అమెరికాకు భారత్ సమన్లు, హెచ్చరిక
న్యూఢిల్లీ: అమెరికా దౌత్యాధికారులకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. భారతీయ జనతా పార్టీతోపాటు పలు పార్టీలపై అమెరికా నిఘా అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే భారత్ అమెరికాకు సమన్లు జారీ చేసినట్లు తెలిసింది.
బుధవారం అమెరికా దౌత్యాధికారులను పిలిపించిన భారత ప్రభుత్వం.. వారితో మాట్లాడింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని వారికి తేల్చి చెప్పింది. అయితే మళ్లీ ఇలాంటి తప్పిదం జరగదంటూ అమెరికా నుంచి భారత్ హామీ పొందినట్లు తెలిసింది.

కాగా, ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలనుకునే అమెరికా బిజెపితోపాటు... ముస్లిం బ్రదర్ హుడ్, నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ (ఈజిప్టు), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పాకిస్థాన్), అమల్ (లెబనాన్), బొలీవియన్ కాంటినెంటల్ కో-ఆర్డినేటర్ (వెనుజువెలా) పార్టీలపై అమెరికా నిఘా సంస్థ 'నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ' నిఘా పెట్టినట్లు తెలిసింది. 2010లో ఈ నిఘాకు తెరలేచినట్లు రహస్య పత్రాల ద్వారా వెల్లడైంది. కీలక పత్రాలను బయటపెడుతూ అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న స్నోడెన్ ద్వారానే ఈ విషయమూ బహిర్గతమైంది. దీనిపై 'ది వాషింగ్టన్ పోస్ట్' ఓ కథనం ప్రచురించింది.
నిజానికి నాలుగు దేశాలు తప్ప ఏ విదేశీ ప్రభుత్వం కూడా ఎన్‌ఎస్‌ఏ నిఘా పరిధులకు దూరంగా లేవని కూడా ఆ పత్రిక తెలిపింది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఆ నాలుగు దేశాల్లో ఉన్నాయి. అమెరికాలోని ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ కోర్టు 'అనుమతి' మేరకు ఎన్ఎస్ఏ ఈ చర్యలు చేపట్టింది. కోర్టు ఉత్తర్వుల్లో మొత్తం 193 దేశాలు, ఆయా దేశాల పార్టీలు, సంస్థల ప్రస్తావన ఉంది. అయితే... కోర్టు ఉత్తర్వుల్లోని అన్ని దేశాల సంస్థలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పలేమని, అలా చేసేందుకు మాత్రం కోర్టు అనుమతి ఇచ్చిందని ఎన్ఎస్ఏ ప్రతినిధి వనీ వైన్స్ పిటిఐకి తెలిపారు.












Click it and Unblock the Notifications