ఇకపై కార్లు తనంతట తావే బ్రేక్ వేసుకుంటాయి.. కేంద్రం సంచలన గెజిట్!
భారతీయ రోడ్లపై పెరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు , ప్రయాణికుల ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయానికి సిద్ధమైంది. అకస్మాత్తుగా ఎదురుగా ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు డ్రైవర్ అప్రమత్తమయ్యే లోపే కారు తనంతట తానుగా స్పీడ్ తగ్గించి బ్రేక్ వేసే టెక్నాలజీ రాబోయే రోజుల్లో ప్రతి కారుకు తప్పనిసరి చేయనుంది. కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఈ మేరకు ఒక కీలక గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ నూతన నిబంధనలను రూపొందించారు.
కొత్త కార్లలో ఏఈబీఎస్ (AEBS).. అమలు ఎప్పటి నుంచంటే?
ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం.. ప్యాసింజర్ కార్ల విభాగంలో వచ్చే కొత్త ఎం1 (M1) కేటగిరీ మోడళ్లలో అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (AEBS) అమర్చడాన్ని దశలవారీగా తప్పనిసరి చేయనున్నారు. మార్కెట్లోకి అక్టోబర్ 1, 2030 తర్వాత వచ్చే సరికొత్త కార్ల మోడళ్లలో ఈ ఫీచర్ ఉండటం కచ్చితం చేశారు. ఇక ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న లేదా అంతకుముందు నుంచి తయారవుతున్న ఇతర మోడళ్ల కార్ల విషయానికి వస్తే, వాటి తయారీదారులు అక్టోబర్ 1, 2032 నాటికి ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ వాహనాల్లో అమర్చే ఏఈబీఎస్ సిస్టమ్ ఎప్పటికప్పుడు మారుతున్న 'ఏఐఎస్-185' (AIS-185) ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.

అసలు ఈ ఏఈబీఎస్ (AEBS) ఎలా పనిచేస్తుంది?
ఆటోమొబైల్ రంగంలో అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక అత్యున్నత ప్రివెంటివ్ సేఫ్టీ ఫీచర్. కారు ముందు భాగంలో అమర్చిన అధునాతన రాడార్లు, కెమెరాలు లేదా సెన్సార్లు రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు, వ్యక్తులను లేదా అడ్డంకులను నిరంతరం గమనిస్తూ ఉంటాయి. ఒకవేళ ముందున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేసినా లేదా డ్రైవర్ గమనించడంలో ఆలస్యం చేసినా, ఈ సిస్టమ్ తక్షణమే స్పందించి ముందుగా డ్రైవర్ను అలర్ట్ చేస్తుంది. ఒకవేళ డ్రైవర్ స్పందించకపోతే కారే ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ బ్రేక్లను వేసి ప్రమాదం తీవ్రతను తగ్గిస్తుంది లేదా పూర్తిగా నివారిస్తుంది. ప్రస్తుతం ఈ నిబంధనలపై ప్రజలు , పరిశ్రమ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరుతూ కేంద్రం 30 రోజుల గడువును కేటాయించింది.
ట్రక్కుల కోసం ప్రత్యేకంగా బ్రేకింగ్, ఈఎస్సీ (ESC) నిబంధనలు!
కేవలం చిన్న కార్లు మాత్రమే కాకుండా, భారీ రవాణా వాహనాలైన ట్రక్కుల భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మీడియం , హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం సవరించిన సరికొత్త బ్రేకింగ్ స్టాండర్డ్స్ అక్టోబర్ 1, 2027 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు ట్రక్కులకు 'ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్' (ESC) సిస్టమ్ అమర్చడాన్ని కూడా అదే తేదీ నుంచి తప్పనిసరి చేశారు. 'ఏఐఎస్-162' (AIS-162) ప్రమాణాలకు లోబడి ఉండే ఈ ఈఎస్సీ సిస్టమ్.. ముఖ్యంగా సాయింత్రం వేళల్లో, ప్రమాదకరమైన మలుపుల్లో లేదా ఆకస్మికంగా టర్న్ తీసుకునే సమయంలో ట్రక్కు అదుపుతప్పకుండా కాపాడుతుంది. వాహనం స్కిడ్ కాకుండా లేదా బోల్తా పడకుండా టైర్లకు అవసరమైన మేరకు ఆటోమేటిక్గా బ్రేక్లను అందించి బ్యాలెన్స్ చేస్తుంది.
పెరుగుతున్న ప్రమాదాలు.. ప్రభుత్వ జీరో ఫెటాలిటీ టార్గెట్!
దేశంలో రోడ్డు ప్రమాదాలను, వాటి వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలను పూర్తిగా నివారించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు , మరణాలను 2030 నాటికి కనీసం 50 శాతానికి తగ్గించాలని, భవిష్యత్తులో మరణాల సంఖ్యను సున్నాకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 100 జిల్లాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ 'బ్లాక్ స్పాట్స్'ను సరిదిద్దే పనులను ముమ్మరం చేశారు.
అధికారిక గణాంకాల ప్రకారం 2025లో దేశంలో రోడ్డు ప్రమాదాలు 5.3 శాతం పెరిగి ఏకంగా 5.13 లక్షలకు చేరగా.. ప్రతి గంటకు 59 ప్రమాదాలు జరిగి, 21 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకువస్తున్న ఈ కఠినమైన ఆటోమోబైల్ భద్రతా నిబంధనలు రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంతగానో దోహదపడతాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.
Download













Click it and Unblock the Notifications
