చైనా సరిహద్దులో భారత్ భారీ విన్యాసాలు? యుద్ధం తప్పదా?
భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల్లో భారత వాయుసేన భారీ విన్యాసాలకు సిద్ధమైంది. తూర్పు సెక్టర్‌లోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో హెలికాప్టర్లు, ఫైటర్‌జెట్లు, డ్రోన్లతో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టబోతోంది. లద్దాఖ్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరిశీలించిన తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు 'ప్రళయ్' పేరుతో ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో 'కమాండ్ స్థాయి' విన్యాసాలు చేపట్టేందుకు భారత వాయుసేన సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలను వెల్లడించాయి. హసిమారా, తేజ్‌పుర్, చబువా వంటి ఎయిర్‌బేస్‌ల నుంచి ఈ విన్యాసాలు జరగనున్నాయని, రఫేల్, సుఖోయ్-30ఎంకేఐ లాంటి ఫైటర్ జెట్లు, చినూక్, అపాచీ హెలికాప్టర్లు, సీ-130జే సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్‌క్రాఫ్ట్, డ్రోన్లు వంటివి ఈ విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి.

తూర్పు సెక్టార్‌లో ఇటీవల కాలంలో భారత్ చేపడుతున్న రెండో భారీ విన్యాసాలు ఇవి. గతేడాది డిసెంబరు 15-16 తేదీల్లో తూర్పు సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంట రెండు రోజుల పాటు ఈస్ట్రన్ కమాండ్ వాయుసేన పనితీరును పరిశీలించేందుకు యుద్ధ విన్యాసాలు చేపట్టింది. డిసెంబరు 9వ తేదీన అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ విన్యాసాలు జరిగాయి. అయితే ఘర్షణకు, యుద్ధ విన్యాసాలకు ఎటువంటి సంబంధం లేదని వాయుసేన ప్రకటించింది.
లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?'అని ఆయన ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన జిన్‌పింగ్.. యుద్ధ సన్నద్ధత, సరిహద్దుల్లో పరిస్థితుల గురించి ఆర్మీ జవాన్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన పీఎల్ ఏ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడారు.












Click it and Unblock the Notifications