పాక్-భారత్ బోర్డర్లో యుద్ధ వాతావరణం: ఆర్ధరాత్రి ఆపరేషన్ ఇలా...!
న్యూఢిల్లీ: కాశ్మీర్‌లోకి పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు ఎల్వోసీ వద్ద భారత ఆర్మీ దాడులు చేస్తున్నట్లు ఆర్మీ గురువారం నాడు ప్రకటించింది. దీనిపై పాకిస్తాన్ భగ్గుమంటోంది. తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ దాడి అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు కొనసాగినట్లు ప్రకటించారు.

ఆపరేషన్ ఇలా జరిగింది..
నియంత్రణ రేఖ వద్ద ఉగ్ర స్థావరాలపై భారత్ దళాలు చేపట్టిన లక్షిత దాడులు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ప్రారంభమై వేకువజామున 4.30వరకు కొనసాగాయని సైన్యం తెలిపింది. ఈ ఆపరేషన్ గురించి సైన్యం రాజకీయపార్టీల అగ్ర నేతలకు, ముఖ్యమంత్రులకు వివరణ ఇచ్చింది. పలువురి వివరాల ప్రకారం ఆపరేషన్ ఇలా జరిగిందని చెబుతున్నారు.
ఈ దాడులు పాకిస్థాన్ వైపు అయిదు వందల మీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల లోపు జరిగాయి. వివిధ సెక్టార్లలోని ఆరు నుంచి ఎనిమిది ఉగ్ర స్థావరాలపై ఇవి జరిగాయి. ఈ ఆపరేషన్ కోసం పారా కమాండోస్, హెలికాప్టర్లను వినియోగించారు. దళాలను హెలికాప్టర్ల ద్వారా లక్షిత ప్రదేశాల్లోకి దించారు.
ఉగ్రవాద శిబిరాల్లో చాలా నష్టం వాటిల్లింది. క్షతగాత్రుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉగ్రవాదులకు గైడ్‌లుగా వ్యవహరించేవారు, శిబిర నిర్వాహకులు కూడా ఇందులో ఉన్నారు. ఈ శిబిరాల్లోని వారు జమ్మూ కాశ్మీర్‌లో, ఇతర మెట్రో నగరాలపై దాడులు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఉగ్రవాద శిబిరాలపై వారం రోజులుగా సైన్యం నిఘా పెట్టింది. భారత వాయుసేనతో సహా ఎల్వోసీ వద్ద అన్ని దళాలకు హైఅలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితిని హోంమంత్రి రాజనాథ్ సింగ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలకు వివరించారు. ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు వివరించింది. సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications