చక్రబంధంలో కేంద్రం- అక్రమ వలసదారులపై సంచలన స్టేట్‌మెంట్
Indian deportees: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులు, వారిని తరలించిన విధానం దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనిపై కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వైఖరేంటో తెలియజేయాలంటూ పట్టుబట్టింది. సమగ్ర చర్చ జరగాలంటూ డిమాండ్ చేస్తోంది.
ఈ వ్యవహారంపై చర్చించడానికి ఈ ఉదయమే కాంగ్రెస్ విప్ కేసీ వేణుగోపాల్.. వాయిదా తీర్మానాన్ని సైతం అందజేశారు. దీన్ని స్పీకర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా ఇండియా భాగస్వామ్య ఎంపీలందరూ మూకుమ్మడిగా లేచి నిల్చున్నారు.

అక్రమ వసలదారులు, వారి తరలింపు విధానంపై అధికార ఎన్డీఏ తన వైఖరిని తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు. దీనితో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వారిని వారించడానికి స్పీకర్ ఓం బిర్లా, ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనితో సభను ఈ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
తోటి భారతీయులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో తరలించడం దేశానికి అవమానకరంటూ కేసీ వేణుగోపాల్ ధ్వజమెత్తారు. అమెరికా చర్య- దేశ సార్వభౌమతాన్ని ప్రశ్నించినట్టయిందని వ్యాఖ్యానించారు. దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం తన నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాళ్లేమీ క్రిమినల్స్ కాదని గుర్తు చేశారు. దీనిపై చర్చించడానికీ కేంద్రానికి తీరిక దొరకట్లేదంటూ విమర్శించారు.
ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం మెత్తబడింది. ఓ అడుగు వెనక్కివేసింది. అక్రమ వలసదారుల పట్ల అమెరికా అనుసరిస్తోన్న విధానం పట్ల తన వైఖరి ఏమిటో తెలియజేయనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ ఓ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.
ఈ విషయాన్ని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. అక్రమ వలసదారులను తరలించిన విధానం, ఆ దేశ ప్రభుత్వం ప్రదర్శించిన తీరు తమనూ బాధించిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ- అలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications