ఇండియన్ ముజాహిదీన్, ఈస్టిండియా కంపెనీ: విపక్ష ఇండియా కూటమిపై మోడీ తీవ్ర స్పందన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాల కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు పార్లమెంటులో రచ్చ, 'ఇండియా' అనే పదంపై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
PM Shri @narendramodi and other senior leaders arrive for the BJP Parliamentary Party Meeting in New Delhi. pic.twitter.com/3Hk6q5wlwa
— BJP (@BJP4India) July 25, 2023
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు 26 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. దీనిని 'ఇండియా' లేదా భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ.. కీలకమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విపక్షాలపై మండిపడ్డారు.

'ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా 'ఇండియా' అనే పదాన్ని ఉపయోగించుకుంది. ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ కూడా ఇండియా పేరుతో ఉంది. కాబట్టి కేవలం 'ఇండియా' పేరును లాక్కోవడం పనికిరాదని వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ. నిషేధిత ఉగ్రవాద అనుబంధ సంస్థ పీఎఫ్ఐకి కూడా ఇండియా పేరును వాడుకుందని గుర్తు చేశారు. ఇండియా పేరు పెట్టుకుంటే సరిపోదని విపక్షాలకు చురకలంటించారు.
దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే విపక్షాలు ఆ పేరును పెట్టుకున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. మణిపూర్ సమస్య కారణంగా పార్లమెంట్‌లో రచ్చ జరగడంపై ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇలాంటి "దిక్కులేని ప్రతిపక్షాన్ని" తాను ఎన్నడూ చూడలేదని తీవ్రంగా స్పందించారు.
ప్రతిపక్షాలు చెల్లాచెదురుగా, నిరాశగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో అన్నారు. తాము ఎక్కువ కాలం అధికారంలో ఉండాలనే కోరిక వారికి లేదన్నట్లుగా ప్రతిపక్షాల వైఖరి కనిపిస్తోందని ప్రధాని మండిపడ్డారు. కాగా, మంగళవారం కూడా పార్లమెంటులో విపక్షాలు ఆందోళనలు కొనాసగించాయి. దీంతో సమావేశాలు ప్రారంభమైన నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి.
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తాము చర్చకు సిద్ధమేనని కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినప్పటికీ.. శాంతించని ప్రతిపక్షాలు ఆందోళనలను కొనసాగించాయి. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభలో ఛైర్మన్ విపక్షాలను సభకు సహకరించాలని కోరినప్పటికీ.. విపక్ష సభ్యులు మాత్రం కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ అల్లర్లపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించడం గమనార్హం.












Click it and Unblock the Notifications