ఎయిరిండియా క్రాష్ పై మరో ట్విస్ట్..! విదేశీ మీడియాకు పైలట్ల సంఘం షాక్..!
గత నెలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏఐ171 ప్రమాదంపై భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో నివేదిక తర్వాత దీనికి మరింత మసాలా జోడిస్తూ విదేశీ మీడియా సంస్థలు రాయిటర్స్, వాల్ స్టీట్ జర్నల్ కథనాలు ప్రచురించాయి. భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) తన మధ్యంతర నివేదికలో ప్రమాదం జరిగిన రోజు పైలట్లు మాట్లాడుకున్న మాటల్ని వెల్లడించింది. దీనిపైనా గతంలో పైలట్ల సంఘం మండిపడింది.
ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ తో పాటు రాయిటర్స్ ఏకంగా ఈ పైలట్ల మాటలతో పాటు కాక్ పిట్ వాయిస్ రికార్డింగ్ పేరుతో మరిన్ని విషయాలు జోడించి కథనాలు ఇచ్చాయి. అలాగే పైలట్లలో కెప్టెన్ ఫ్యూయల్ స్విచ్ ఆపేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. దీంతో పైలట్లపై మరిన్ని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత పైలట్ల సమాఖ్య ఇవాళ ఈ రెండు విదేశీ మీడియా సంస్థలకు నోటీసులు పంపింది.

గత నెల 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదాలు, కాక్ పిట్ గందరగోళమే కారణమంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ ఇచ్చిన కథనాలపై స్పందిస్తూ పైలట్ల సమాఖ్య వారికి లీగల్ నోటీసులు పంపింది. వీరి కథనాలు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని ఆధారాలు లేకుండా తప్పుగా ఆపాదించాయని పైలట్ల సంఘం ఆరోపించింది.
ఈ రెండు సంస్ధలకు పంపిన నోటీసుల్లో.. మీడియా సంస్థలు ఎంపిక చేసిన, ధృవీకరించని కథనాలు వండి వార్చినందుకు అధికారికంగా క్షమాపణ చెప్పాలని కోరింది. ఓవైపు దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇలాంటి కథనాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని తెలిపింది. మీడియా జర్నలిస్టిక్ సమగ్రతను కాపాడాలని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరింది. మరోవైపు అమెరికా ప్రభుత్వ రవాణా సంస్థ కూడా ఈ నివేదికల్ని ఖండించింది.












Click it and Unblock the Notifications