కొత్త నిబంధన: రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకువెళ్తే షాక్ తప్పదు
న్యూఢిల్లీ: రైళ్లలోని కంపార్టుమెంటులలో పరిమితికి మించి లగేజీ తీసుకు వెళ్తే జరిమానా విధించాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు రైళ్లలో ఎంత లగేజీ అయినా ఉచితంగా తీసుకుపోవచ్చు. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం మాత్రం అంతకంటే ఎక్కువ తీసుకు వెళ్తే జరిమానా ఉంటుంది.
ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రాజెన్ లోకసభలో బుధవారం లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ ప్రయాణికులు 40 కిలోల సామాన్లను, సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల లగేజీని, ఫస్ట్/టైర్ 2 ఏసీ క్లాస్‌లో 50 కేజీలు, ఫస్ట్ ఏసీలో 70 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకు వెళ్లేందుకు రైల్వే అనుమతిస్తోంది.

గరిష్ఠ పరిమితి తర్వాత కూడా నిర్ణీత అదనపు ఛార్జితో మరింత లగేజీని తీసుకు వెళ్లవచ్చు. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల సామాన్లను, స్లీపర్ క్లాస్ 80 కిలోలు, ఏసీ 3టైర్/ఏసీ చైర్ కార్ ప్రయాణికులు 40 కిలోలు, ఫస్ట్ క్లాస్/ ఏసీ టైర్ 2 ప్రయాణికులు 100 కిలోలు, ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 150 కిలోల దాకా గరిష్ఠంగా తీసుకు వెళ్లవచ్చు. అదనపు సామానును నిర్దేశిత బోగీలో ఉంచవల్సి ఉంటుంది.
కొత్త నిబంధన ప్రకారం పరిమితికి మించిన బరువులను వెంట తీసుకు వెళ్తే సదరు ప్రయాణికులకు లగేజీ టికెట్ ధరకు ఆరు రెట్ల జరిమానా వేస్తారు. రష్ సమయంలో, ఎండాకాలంలో రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకు వెళ్లడం వల్ల తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని కేంద్రమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications