Everest: ఎవరెస్ట్ మసాలా పౌడర్లపై సింగపూర్, హాంకాంగ్ లో నిషేధం- క్లారిటీ ఇచ్చిన సంస్ధ..!
క్యాన్సర్ కారకాలున్న కారణంతో భారతీయ మసాలా పౌడర్ బ్రాండ్లు అయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ పై సింగపూర్, హాంకాంగ్ లో నిషేధం విధించినట్లు వార్తలొచ్చాయి. దీంతో కేంద్రం కూడా వెంటనే స్పందించి వీటి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కు పంపాలని ఆదేశాలు ఇచ్చంది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ సంస్ధ స్పందింది. సింగపూర్, హాంకాంగ్ లో తమ ఉత్పత్తుల్ని నిషేధించారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చింది.
అంతకు ముందు ఎవరెస్ట్ బ్రాండ్ మసాలా పౌడర్లలో క్యాన్సర్ కారకంగా భావిస్తున్న ఇథిలీన్ ఆక్సైడ్ ఉందన్న కారణంతో సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు నిషేధం విధించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఎవరెస్ట్ సంస్ధ ఖండించింది. ఈ మేరకు వన్ ఇండియాకు చెందిన గుడ్ రిటర్న్స్ పోర్టల్ కు ఈమెయిల్ ద్వారా స్పష్టత ఇచ్చింది. ఇందులో ఆయా దేశాల్లో నిషేధం వార్తలు తప్పని తేల్చేసింది.

సింగపూర్, హాంకాంగ్‌లలో ఎవరెస్ట్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని సూచిస్తున్నట్లు వచ్చిన నివేదికలు పూర్తిగా అవాస్తవమని, రెండు దేశాల్లోనూ ఎలాంటి నిషేధం లేదని తెలిపింది. అలాగే సింగపూర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ హాంకాంగ్‌లో జారీ చేసిన రీకాల్ హెచ్చరికకు కూడా స్పందించింది. అదనపు తనిఖీ కోసం ఒక ఉత్పత్తిని తాత్కాలికంగా ఉంచి, రీకాల్ చేయమని మా దిగుమతిదారుని అభ్యర్థించిందని వెల్లడించింది. ఇది వినియోగదారు ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో రూపొందించబడిన ఒక ప్రామాణిక విధానమని తెలిపింది.
ఎవరెస్ట్ ఈ రంగంలో 50 ఏళ్ల అనుభవాన్ని కలిగి ఉందని తెలిపింది. తమ ఉత్పాదక సౌకర్యాలలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రతకు, భద్రతకు కట్టుబడి ఉందని పేర్కొంది. ఆహార భద్రత పట్ల తమ అంకితభావం చాలా ముఖ్యమైనదని తెలిపింది అనేక సంవత్సరాలుగా తాము సంపాదించిన జాతీయ, అంతర్జాతీయ ధృవపత్రాల ద్వారా ఇది నిరూపించబడిందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications