భారత్ లోకి చొరబడేందుకు 1500 మంది ఉగ్రమూకలు సిద్ధం? అల్ట్రా హై అలర్ట్ ప్రకటించిన భారత సైన్యం..!
పాకిస్థాన్.. ఎంత కొట్టినా చావని పాములా వ్యవహరిస్తూనే ఉంది. గతేడాది ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 26 మంది అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న ఉగ్ర మూకలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది. అలాగే వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయినా ఆ దేశం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు.
తాజాగా LoC వెంబడి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్( POK) వద్ద ఉగ్రవాదుల కదలికలు పెరిగనట్లు నిఘా వర్గాలు తేల్చాయి. POK లో దాదాపు 70-72 వరకు లాంచ్ పాడ్స్ మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఇవి దాదాపు 800 మందికిపైగా ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే మనదేశంలోకి చొరబాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య దాదాపు 1500 లకు పైగానే ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ మేరకు భారత్ లోకి మరోసారి చొరబడేందుకు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో భారత్ సైన్యం దేశవ్యాప్తంగా అల్ట్రా హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు సరిహద్దులో భారత్ సైన్యం, బీఎస్ఎఫ్, కాశ్మీర్ పోలీసులు నిఘా పెంచారు.
అయితే 2025 చివరి నాటికి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో కేవలం 6 నుంచి 7 లాంచ్ ప్యాడ్ లుమాత్రమే ఉండేవి. వాటిలో కేవలం 100 నుంచి 120 మంది ఉగ్రవాదులు మాత్రమే ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో పలు కారణాల దృష్ట్యా ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే సరిహద్దు వద్ద ఉగ్రమూకలు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ ప్రోత్సాహంతో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలు భారీ ఎత్తున చొరబాట్లు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. దాంతో భారత్ సైన్యం సరిహద్దు వద్ద పూర్తిగా అప్రమత్తం అయింది.

ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అందులో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications