బెంగళూరు వెళ్లే కర్నూలు వాసులకు గుడ్ న్యూస్..!
రాయలసీమలోని కర్నూలు వాసులకు మరో గుడ్ న్యూస్ అందింది. కర్నూలు నుంచి పొరుగున ఉన్న కర్నాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేందుకు 350 కిలోమీటర్ల దూరంతో పాటు ఆరు గంటల ప్రయాణం తప్పదు. దీంతో బెంగళూరుకు వేగంగా చేరుకునేందుకు వీలుగా కర్నూలు వాసులకు మరోసారి విమాన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది.
కర్నూలు నుంచి బెంగళూరుకు గతంలో ఇండిగో విమానం నడిచేది. కానీ వివిధ కారణాలతో ఇండిగో ఈ సర్వీసును నిలిపేసింది. దీంతో కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లాలంటే రోడ్డు లేదా రైలు మార్గాల్లోనే వెళ్లాల్సిన పరిస్ధితి. ఈ నేపథ్యంలో తాజాగా నంద్యాల ఎంపీగా గెలిచిన బైరెడ్డి శబరి జోక్యం చేసుకున్నారు. కర్నూలు నుంచి బెంగళూరుకు ఇండిగో సర్వీసు పునరుద్ధరించాలని పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. దీంతో ఆయన స్పందించారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ తో మాట్లాడి బెంగళూరు-కర్నూలు మధ్య రెగ్యులర్ సర్వీసు నడిపేలా ఒప్పించారు. దీంతో ఇప్పుడు ఇండిగో ఆగస్టు 18 నుంచి తిరిగి తమ సర్వీసు ప్రారంభించబోతోంది. ప్రతీ సోమ, బుధ వారాల్లో ఈ సర్వీసు ఉంటుంది. అలాగే కర్నూలు నుంచి విజయవాడకు సైతం అక్టోబర్ ఆఖరు నుంచి సర్వీసు ప్రారంభించేందుకు ఇండిగో అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కర్నూలు ఎయిర్ పోర్టులోనూ రన్ వే పొడిగింపు, రాత్రి వేళల విమానాలు ల్యాండ్ అయ్యేలా విద్యుదీకరణ పనులు పూర్తి చేసేందుకు నంద్యాల ఎంపీ ప్రతిపాదనలు పంపారు.












Click it and Unblock the Notifications