ఏఐ రంగంలో రిలయన్స్ రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి.. అంబానీ సంచలన ప్రకటన!!
న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో ఏఐ పాత్ర ఉందని, ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర ఉందని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీని మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా అభివర్ణించిన ముఖేష్ అంబానీ దేశ సాంకేతిక విప్లవానికి ప్రభుత్వ సహకారం అనివార్యం అంటూ పేర్కొన్నారు.
ఏఐపై రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో భారీ ప్రణాళిక
ఏఐ కేవలం ఒక సాధారణ సాంకేతికత కాదని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ఇది మహాభారతంలోని అక్షయపాత్ర వంటిదని పేర్కొన్న ఆయన మనుషులలో ఆలోచించగల, మాట్లాడగల, విశ్లేషించగల ఈ వ్యవస్థలు భవిష్యత్తులో ప్రతి రంగాన్ని మార్చివేస్తాయని పేర్కొన్నారు. భారత ఏఐ సామర్థ్యాలను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో భారీ ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు.

రాబోయే ఏడేళ్ళలో పదిలక్షల కోట్లు పెట్టుబడి
రాబోయే ఏడేళ్లలో ఏఐలో సుమారు పదిలక్షల కోట్లు పెట్టుబడి పెడతామని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది వ్యాపార నిర్ణయం కాదని దేశ నిర్మాణానికి కేటాయించిన మూలధనం అని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక విలువలను సృష్టించే లక్ష్యంతో ఈ పెట్టుబడి పెడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో డేటాధరలు తగ్గించి, ఇంటర్నెట్ ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చిన జియో, ఇప్పుడు మేధస్సు ఖర్చును సైతం తగ్గించాలని ప్రత్యక్షంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
జియోతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంతో కలుపుతామన్న ముఖేష్ అంబానీ
ఇతర దేశాల పైన ఆధారపడకుండా స్వతహాగా ఏఐ సామర్ధ్యాలను పెంపొందించుకుంటూ తక్కువ ధరలకే పౌరులకు ఏఐ సేవలను అందించి డిజిటల్ అంతరాన్ని తగ్గించాలని ఆయన ఆకాంక్షించారు. జియో ద్వారా గతంలో భారతదేశంలో ఇంటర్నెట్ యుగం తో అనుసంధానం చేశామని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంతో కలుపుతామని ముఖేష్ అంబానీ భరోసా ఇచ్చారు.
పరిపాలనలో పారదర్శకతను పెంచే ఏఐ
ఏఐ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలో, ప్రభుత్వ సేవలలో, సామాజిక అభివృద్ధిలో అంతర్భాగం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది పరిపాలనలో పారదర్శకతను కూడా పెంచుతుంది అన్నారు. భారతదేశంలో ఏఐ ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారుతుందని, ఏఐకు లభిస్తున్న అద్భుతమైన స్పందన చూస్తే 21వ శతాబ్దంలో దేశం ఒక గొప్ప ఏఐ శక్తిగా అవతరిస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికతను మానవత్వంతో జోడించి అందరికీ సమృద్ధిని చేకూర్చడమే రిలయన్స్ అంతిమ లక్ష్యంగా పేర్కొన్న ఆయన 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏఐలో పెట్టబోతున్నట్లు శుభవార్త చెప్పారు.












Click it and Unblock the Notifications