IPL 2023 : అనామకులుగా వచ్చి హీరోలుగా మారిన ఆటగాళ్లు వీరే..
ఈసారి ఐపీఎల్ 2023 సీజన్ గత సీజన్లు అన్నింటికంటే భిన్నంగా సాగుతోంది. ఆటగాళ్లు, జట్ల ప్రదర్శనల పరంగా చూసినా, జట్ల మధ్య పోటీ పరంగా చూసినా, టీవీ, డిజిటల్ రేటింగ్స్ పరంగా చూసినా ఈ టోర్నీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమంగా నిలుస్తోంది. ఇదే క్రమంలో మరో విషయంలోనూ ఈసారి ఐపీఎల్ సీజన్ 2023ను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. అదే అనామక ఆటగాళ్లుగా (అన్ క్యాప్డ్) వచ్చి ఆ తర్వాత హీరోలుగా మారిపోయిన వారి అంశం.
ఈసారి ఐపీఎల్ సీజన్ లో పలువురు ఆటగాళ్లు వేలంలో అన్ క్యాప్డ్ గా అడుగుపెట్టారు. అన్ క్యాప్డ్ గా వేలంలో పాల్గొని ఆయా జట్లు వీరిని తీసుకోవాలా వద్దా అని పలుమార్లు ఆలోచించుకుని ఓసారి చూద్దాంలే అని తీసుకున్న ఆటగాళ్లు పలువురు ఉన్నారు. వీరిలో ఓ యశస్వీ జైశ్వాల్, మరో రింకూ సింగ్, ఇంకో ఆకాష్ మధ్వాల్, మరో తుషార్ దేశ్ పాండే వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా అన్ క్యాప్డ్ ఆటగాళ్లుగా తమ జట్లలోకి అడుగుపెట్టిన వారే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీరు చెలరేగిపోయారు.

అన్ క్యాప్డ్ ఆటగాళ్లుగా ఈ టోర్నీలో అడుగుపెట్టి దుమ్మురేపిన వారి జాబితాలో యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్, ప్రభ్ సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, జితేష్ శర్మ, ఆయుష్ బదోనీ, నీహల్ వథేరా, తిలక్ వర్మ, రాహుల్ తెవాటియా, తుషార్ దేశ్ పాండే, ఆకాష్ మధ్వాల్, సుయాష్ శర్మ, వైభవ్ ఆరోరా వంటి వారు ఉన్నారు. వీరిలో ప్రధానంగా చూసుకుంటే యశస్వీతో పాటు మరికొందరు ఆటగాళ్లు అంచనాలకు అందని ఆటతీరుతో హీరోలుగా మారిపోయారు.
రాజస్తాన్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ 14 మ్యాచ్ ల్లో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 625 పరుగులు చేశాడు. ముంబై లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రింకూ సింగ్ నాలుగు హాఫ్ సెంచరీలతో 474 పరుగులు చేశాడు. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 358 రన్స్ చేశాడు. అలాగే చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే 14 మ్యాచ్ ల్లో ఏకంగా 20 వికెట్లు తీశాడు. కోల్ కతా బౌలర్ సుయాష్ శర్మ 10 వికెట్లు, ముంబై బౌలర్ ఆకాష్ మధ్వాల్ 8 వికెట్లు తీశాడు.












Click it and Unblock the Notifications