వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPO: ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ అంటే ఏమిటి? దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్టాక్ ట్రేడర్

కళ్యాణ్ జ్యువెలర్స్ ఐపీఓ‌ మార్చి 16 నుంచి ప్రారంభమవుతుండడంతో స్టాక్ మార్కెట్లలో మదుపు చేసేవారు అటువైపు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఈ ఏడాదే బీమా సంస్థ ఎల్ఐసీ కూడా పబ్లిక్ ఇష్యూకి వస్తుందని కొద్ది రోజులుగా బిజినెస్ పేజీల్లో వార్తలు కనిపిస్తుండడంతో మదుపర్లు దాని కోసమూ ఎదురుచూస్తున్నారు.

కోవిడ్ తరువాత కొత్త డీమ్యాట్ అకౌంట్లు, మదుపర్లు పెరగడంతో ఐపీఓలపైనా ఆసక్తి ఎక్కువైంది.

కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ ఐపీఓ‌తో రూ. 1,175 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే ఐపీఓలో ఒక్కో షేర్ ధర రూ. 86 -87గా నిర్ణయించారు.

ఇంతకీ ఐపీఓ అంటే ఏమిటి?

నిత్యం స్టాక్ మార్కెట్లను అధ్యయనం చేసేవారు, అందులో పెట్టుబడులు పెట్టేవారు, క్రయవిక్రయాలు జరిపేవారికి ఐపీఓ అనే పదం కొత్తేమీ కాదు. 'ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్’ అనేదానికి సంక్షిప్త రూపమే ఐపీఓ.

వ్యాపార సంస్థలు మూలధన సమీకరణ, వ్యాపార విస్తరణ వంటి అవసరాల కోసం నిధులు సేకరించడానికి ఎంచుకునే మార్గంలో భాగంగా మొట్టమొదటిసారి స్టాక్‌ మార్కెట్‌లో నమోదవడమే ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్.

ఈ విధానంలో ప్రజలకు (డీమ్యాట్ ఖాతాలు ఉండి దరఖాస్తు చేసుకున్నవారికి) తమ సంస్థ షేర్లను విక్రయించడం ద్వారా నిధులు సమీకరిస్తారు. కాబట్టి దీన్ని పబ్లిక్ ఆఫర్ అంటారు.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్

ఏ సంస్థ అయినా ఐపీఓ‌కు వెళ్లొచ్చా.. అర్హతలేమిటి?

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం ఐపీఓకు వెళ్లాల్సి ఉంటుంది.

కంపెనీ, దాని ప్రమోటర్లకు సంస్థలో సెబీ ప్రమాణాల ప్రకారం కనీస వాటాలు కలిగి ఉండడం ప్రధాన అర్హత. కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతుండాల్సిన అవసరమూ ఉంటుంది.

సంస్థ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవడానికి ముందు మూడేళ్లలో ప్రతి ఏడాదీ దాని స్థిరాస్తుల విలువ రూ. 3 కోట్లకు తగ్గకుండా ఉండాలి.

ఐపీఓకు ముందు అయిదేళ్లలో కనీసం మూడు సంవత్సరాలు ఏటా రూ. 15 కోట్లకు తగ్గకుండా లాభం వచ్చి ఉండాలి.

పబ్లిక్ ఇష్యూ పరిమాణం.. అది జారీ చేయడానికి ముందున్న నికర విలువ కంటే 5 రెట్లు దాటకూడదు.

ఇలాంటి మరికొన్ని నిబంధనలను సంతృప్తి పరిచే సంస్థ ఐపీఓకు వెళ్లడానికి తమకు అర్హత ఉందంటూ ఆ వివరాలు జోడించి ఆఫర్ డాక్యుమెంట్‌ను సెబీకి సమర్పిస్తుంది.

సెబీ దాన్ని ఆమోదిస్తే అక్కడి నుంచి సంబంధిత స్టాక్ ఎక్స్చేంజ్ ఇష్యూ రిజిస్ట్రార్‌కు పంపించాలి.

అక్కడ కూడా అన్ని నిబంధనల ప్రకారం ఉంటే ఆమోదం పొంది ఐపీఓకు అనుమతి లభిస్తుంది.

ధర ఎలా నిర్ణయిస్తారు?

సాధారణంగా ఐపీఓ షేర్ ధర నిర్ణయం రెండు పద్ధతుల్లో ఉంటుంది. మొదటిది బుక్ బిల్డింగ్ పద్ధతి. ఇందులో ఐపీఓ‌కు వచ్చిన సంస్థకు చెందిన షేర్ ధరను నిర్ణీత వ్యవధిలో నిర్ణయిస్తారు. అంటే కనిష్ఠ, గరిష్ఠ ధర ఉంటుందన్నమాట. దరఖాస్తు చేసుకునేవారు ఆ రేంజ్‌లోనే కోట్ చేయాలి.

రెండోది ఫిక్స్‌డ్ ప్రైస్ పద్ధతి.. ఈ విధానంలో ముందే ధరను కచ్చితంగా నిర్ణయిస్తారు. కంపెనీ తన ఆఫర్ డాక్యుమెంట్‌లో ఈ ధర, కనీసం ఎన్ని షేర్లు కొనాలి.. కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలి.. వంటి వివరాలన్నీ స్పష్టం చేస్తుంది. దాని ప్రకారం దరఖాస్తు చేసుకున్న తరువాత డిమాండ్‌ను అనుసరించి కేటాయింపులు చేస్తుంది.

ఐపీఓ ఎన్ని రోజులు ఉంటుంది?

ఐపీఓ ప్రకటించిన తరువాత గరిష్ఠంగా 10 రోజులు ఉంటుంది. కనీసం మూడు రోజులు అందుబాటులో ఉండాలి. అంటే.. 3 నుంచి 10 రోజుల వరకు ఐపీఓ అందుబాటులో ఉంటుంది.

బుక్ బిల్డింగ్ పద్ధతిలో అయితే గరిష్ఠంగా 7 రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రైస్ రేంజ్‌లో ఏమైనా మార్పులు చేస్తే మరో 3 రోజులు అదనపు సమయం ఇస్తారు.

ఐపీఓ‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఐపీఓ కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ఐపీఓ ప్రకటించిన సంస్థ వెల్లడించిన తేదీలలో తమ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ట్రేడింగ్ ఖాతా ద్వారా కానీ ఆ ఐపీఓ‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఐపీఓ దరఖాస్తు ప్రకారం ఎంత మొత్తం పెట్టుబడికి నిర్దేశించారో అదంతా మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. ఐపీఓలో మీకు కేటాయించిన షేర్లను బట్టి అందులో మినహాయించుకుని మిగతాది ఖాతాలో రిలీజ్ చేస్తారు.

అసలు కేటాయింపు లేకపోతే మొత్తం డబ్బు రిలీజ్ అవుతుంది. అంటే ఇతర లావాదేవీలకు ఆ డబ్బు ఎప్పటిలా అందుబాటులోకి వస్తుంది.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్

షేర్లు ఎలా కేటాయిస్తారు.. లాట్ అంటే ఏమిటి?

షేర్ల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్నవారందరికీ షేర్లు రాకపోవచ్చు.

సంస్థ ఐపీఓకు వచ్చినప్పుడే కనీస షేర్ల సంఖ్యను వెల్లడిస్తుంది.. దాన్నే లాట్ అంటారు. ఆ లాట్ కంటే తక్కువ షేర్లు కోరుతూ దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు తిరస్కరిస్తారు.

అలాగే లాట్ ప్రకారమే దరఖాస్తు చేసినా ఒక్కోసారి కోరుకున్నన్ని షేర్లు కేటాయించకపోవచ్చు.

మొత్తం ఎన్ని షేర్లు అందుబాటులో ఉన్నాయి.. ఎన్ని బిడ్‌లు దాఖలయ్యాయి.. అనేదాన్ని బట్టి షేర్ల కేటాయింపు ఉంటుంది.

సంస్థ కేటాయించిన ప్రకారం ఇష్యూ ముగిసినప్పటి నుంచి 5 రోజుల్లోగా మదుపరుల డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు జమ అవుతాయి.

గత అయిదేళ్లలో ఐపీఓలు ఇలా..

సంవత్సరం

ఐపీఓలు

ఎక్కువ ధర పలికినవి

తక్కువ ధర పలికినవి

2021(మార్చి 11 వరకు)

9

7

2

2020

31

24

7

2019

49

37

12

2018

88

64

24

2017

89

69

20

సెబీ ప్రధాన కార్యాలయం

సమస్యలు వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

షేర్ల జారీ విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగినా, డబ్బులు రీఫండ్ కావడంలో సమస్యలు ఏర్పడినా ఐపీఓ జారీ చేసిన కంపెనీ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించాలి.

అక్కడ పరిష్కారం కాకపోతే సెబీకి ఫిర్యాదు చేయాలి.

'ఆఫీస్ ఆఫ్ ఇన్వెస్టర్ అసిస్టెన్స్ అండ్ ఎడ్యుకేషన్, సెబీ, సీ-4, జీ బ్లాక్, కుర్లా కాంప్లెక్స్, ఈస్ట్ బాంద్రా, ముంబయి' అనే చిరునామాకు పూర్తి వివరాలతో ఫిర్యాదు పంపించాలి.

(ఆధారం: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
IPO: What is an Initial Public Offer? Will shares be allotted to all those who have applied?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X