భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ నేటితో ముగిసిందా? భారత సైన్యం కీలక ప్రకటన
పహల్గామ్ లో పర్యాటకుల పైన ఉగ్ర మూక విచక్షణ రహితంగా మారణకాండ సృష్టించిన నేపథ్యంలో ఉగ్రవాదులను అణచివేయడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేసిన భారత్ దాదాపు 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించింది.
భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ నేటితో ముగుస్తుందా?
భారత్ దాడికి ప్రతీకార దాడులు చేస్తామని ప్రకటించిన పాక్ సరిహద్దులలో భారత్ పైన దాడులు చేయడానికి విఫలయత్నాలు చేసి చివరకు కాళ్ల బేరానికి వచ్చింది. ఈ క్రమంలో సీజ్ ఫైర్ ప్రకటించింది భారత్. దీంతో ఆపరేషన్ సిందూర్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సీజ్ ఫైర్ పై క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ వర్గాలు
తాజాగా భారత రక్షణ శాఖ వర్గాలు దీనిపైన క్లారిటీ ఇచ్చాయి. నేటితో భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పులు విరమణ ముగుస్తున్నట్టు వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని వెల్లడించాయి. ఈనెల 10వ తేదీన ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహన ప్రస్తుతం కొనసాగుతోందని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
సీజ్ ఫైర్ పై డీజీఎంవో చర్చల నిర్ణయమే కొనసాగుతుంది
అంతేకాదు నేడు జరగాల్సిన డిజిఎంవో చర్చల మీద కూడా క్లారిటీ ఇచ్చాయి. ఈరోజు ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశాయి. ఈనెల 10వ తేదీన జరిగిన డీజీఎంవో చర్చలలో నిర్ణయానికి కాలపరిమితి లేదని పేర్కొన్నారు. మే 10వ తేదీన రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తమ ప్రకటనతో ఆందోళనకు చెక్ పెట్టిన రక్షణ శాఖ
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ నేటితో ముగుస్తున్నట్టు, మళ్లీ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని, ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రజలలో కలుగుతున్న ఆందోళనకు రక్షణ శాఖ వర్గాలు తమ ప్రకటనతో చెక్ పెట్టాయి. అయితే దీనికి కాల పరిమితి లేదని చెప్పిన రక్షణ శాఖ వర్గాలు, పాకిస్తాన్ అవగాహనను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications