ఆపరేషన్ సింధూర్ లో 400 మంది సైంటిస్టుల కృషి: ఇస్రో చీఫ్
ఏప్రిల్ 22 న పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇస్రోకు చెందిన 400 మంది శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని ఇస్రో చీఫ్ వి నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అహర్నిశలు శ్రమించి దేశ భద్రతకు అవసరమైన సమాచారాన్ని అందించారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి దాగి ఉందని ఇస్రో చీఫ్ వి నారాయణన్ స్పష్టం చేశారు. భూమి పరిశీలన, ఉపగ్రహాల కమ్యూనికేషన్ వంటి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 52వ జాతీయ మేనేజ్‌మెంట్ సమావేశానికి ఇస్రో చీఫ్ వి నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు.
అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ దూసుకెళ్తోందని.. 2027 నాటికి గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోందని వి నారాయణన్ తెలిపారు. గగన్ యాన్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు 7,700 కు పైగా గ్రౌండ్ పరీక్షలు పూర్తి చేశామని.. రాబోయే మానవ అంతరిక్ష ప్రయాణానికి ముందు మరో 2,300 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుతో పాటుగా 2040 నాటికి చంద్రుని పైకి వ్యోమగాములను పంపే లక్ష్యాలను కూడా ఇస్రో నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు.

జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. దీంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరి పారేసినట్లు భారత రక్షణశాఖ స్పష్టం చేసింది.
అంతేకాక పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేసింది. సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం రద్దు, వీసాల జారీ రద్దు, గగనతలం మూసివేత.. తదితర నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications