ఆ ఉద్దేశంతోనే యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కినా: తేల్చేసిన రజినీకాంత్..!!
చెన్నై: సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ.. జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ పతాకం కింద కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగిబాబు, సునీల్, మిర్నామీనన్.. కీలక పాత్రలను పోషించారు.
బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది ఈ మూవీ. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డ్ సృష్టించింది. విడుదలైన అతి కొద్దిరోజుల్లోనే 450 కోట్ల రూపాయలను వసూలు చేసింది. టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ నటనకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు.

ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాను చూడటానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఆసక్తి చూపారంటే.. దీనికి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లో బద్రీనాథుడిని దర్శించుకున్నారు. జార్ఖండ్‌లో యొగొడా సత్సంగ్ ఆశ్రమాన్ని సందర్శించారు.
తన ఉత్తర ప్రదేశ్ పర్యటన సందర్భంగా గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. వంటి రాజకీయ నాయకులను ఆయన కలుసుకున్నారు. వారితో అనేక విషయాలపై చర్చించారు.

తన పర్యటనను ముగించుకుని కొద్దిసేపటి కిందటే చెన్నైకి చేరుకున్నారు రజినీకాంత్. ఈ సందర్భంగా ఇంటి వద్ద తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్‌లో తన పాత మిత్రులను కలుసుకోవడానికి వెళ్లాలని చెప్పారు. చాలాకాలం తరువాత వారిని కలుసుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడంపై వివరణ ఇచ్చారు. సాధువులు, సన్యాసులు, యోగులకు పాద నమస్కారం చేయడం తన అలవాటు అని తేల్చి చెప్పారు. వారు వయస్సులో తనకంటే చిన్నవారే అయినప్పటికీ.. వారి కాళ్లు మొక్కుతానని, వారి ఆశీర్వాదాలను తీసుకుంటానని వివరించారు. ఆ ఉద్దేశంతోనే యోగి ఆదిత్యనాథ్‌కు పాద నమస్కారం చేశానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications