జైల్లో ఉండే ఎమ్మెల్యేగా బంపర్ విక్టరీ.. ఆయన రూటే సెపరేటూ..
ఈ ఎమ్మెల్యే రూటే సెపరేటూ అని అక్కడి స్థానికులు అంటుంటారు. వివాదాస్పద నేతగా పేరుగాంచిన అనంత్ కుమార్ సింగ్.. బిహార్ లోని మోకమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బంపర్ విజయం సాధించారు. జేడీయూ తరఫున పోటీచేసిన ఆయన ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై విజయం సాధించారు. అనంత్ కుమార్ సింగ్ కు 91,416 ఓట్లు రాగా.. వీణా దేవికి 63,023 ఓట్లు మాత్రమే వచ్చాయి. అనంత్ సింగ్ విజయం ఖాయం కావడంతో పాట్నాలోని అతని ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంత్ సింగ్ అభిమానులు మిఠాయిలు పంచుతూ.. డ్యాన్సులు వేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ కార్యకర్త మర్డర్ కేసులో ప్రస్తుతం అనంత్ కుమార్ సింగ్ జైలులో ఉన్నారు. కానీ నియోజకవర్గంపై మాత్రం పట్టును కొనసాగిస్తూనే ఉన్నారు. అనంత్ కుమార్ సింగ్ జైలుకు వెళ్లినా.. ఆయన కేడర్, నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మోకామా ఒకటి. ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 64.77 గా నమోదైంది.
అనంత్ కుమార్ సింగ్ ను చోటే సర్కార్ అని పిలుస్తారు. బిహార్ లో పేరొందిన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. భూమిహార్ క్యాస్ట్ లో ఆయనకు చాలా పట్టుంది. ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అనంత్ కుమార్ సింగ్. అయితే అతనిపై సీరియస్ అభియోగాలు ఉన్నాయి. మర్డర్ కేసు నుంచి ఇల్లీగల్ ఆర్మ్స్ వినియోగం దాకా కేసులు నమోదయ్యాయి. అనంత్ సింగ్.. ఇటీవల తన ఆస్తుల విలువ రూ. 37.88 కోట్లుగా ప్రకటించారు. అతని భార్య నీలం దేవి ఆస్తుల విలువ రూ. 62.72 కోట్లుగా ఉంది. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడని, అప్పీలు పెండింగ్ లో లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు.

ఇక బిహార్ లో ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే ఉంది. ఇక 34 స్థానాల్లో మహాగఠ్ బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బిహార్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి బిహార్ లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications