ఏపీకిచ్చిన హామీలు నెరవేర్చడం లేదు: కేంద్రంపై జైరాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్ధానాలను కేంద్రం నెరవేర్చలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ బుధవారం అన్నారు. మూడు నెలల కిందటే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉందన్నారు. పోలవరం అథారిటీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఇప్పటి వరకు పన్ను రాయితీ ఇవ్వలేదని జైరామ్ రమేష్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం తరఫున రాష్ట్ర విభజన అంశంలో జైరామ్ రమేష్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రిపదవి రాలేదని అసంతృప్తి లేదు : జేసీ
పార్లమెంట్‌లో స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జేసీ దివాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కేంద్రమంత్రి పదవి కావాలని గతంలో చంద్రబాబును కోరినట్లు చెప్పారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి లేదన్నారు. కొత్త బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. రాజధాని ప్రకటన చేయకముందే విపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.
తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ సీరియస్
జైళ్లలో జరుగుతున్న అవినీతిపై తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అడ్వైజ్, వార్నింగ్, యాక్షన్ తో చర్యలుంటాయని ఆయన చెప్పారు.
ఇవాళ ఖమ్మం, సంగారెడ్డి, హుజురాబాద్, నిజామాబాద్ జైలు అధికారులు, సిబ్బందితో వీకే సింగ్ భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితం చర్లపల్లి జైలు సిబ్బందికి ఆయన హెచ్చరిక చేశారు. ఖైదీలకు సెల్ ఫోన్లు అందించడం, వారి నుంచి లంచాలు తీసుకోవడం వంటివి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీషీటర్ యాదగిరికి సెల్‌ఫోన్ ఎవరిచ్చారన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications