ఆ సెన్సిటివ్ ఏరియాలో మోదీ: 50 ఏళ్ల తరువాత అక్కడికి తొలి ప్రధాని
Jammu Kashmir Assembly election 2024: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జమ్మూ కాశ్మీర్. దశాబ్ద కాలం తరువాత ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు.. 90. తొలి దశలో పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కిష్తవార్, దోడా జిల్లాల్లో 24 స్థానాలకు సెప్టెంబర్ 18వ తేదీన ఓటింగ్ జరుగనుంది. గందర్‌బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంఛ్, రియాసి, రాజౌరి జిల్లాల్లో గల 26 స్థానాలకు సెప్టెంబర్ 25న రెండో దశలో పోలింగ్ ఉంటుంది.

అక్టోబరు 1వ తేదీన చివరి దశలో బండీపొర, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్ముూ, సాంబా, కథువా జిల్లాల్లో 40 సీట్లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, సీపీఎం ఈ ఎన్నికల బరిలో నిల్చోనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, ఏడు ఎస్సీ, తొమ్మిది ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్‌డ్ స్థానాలు. మొత్తం 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 44,46,000 వేల మంది పురుషులు, 42, 62,000 మంది మహిళలు ఉన్నారు. 3.71 లక్షల మంది మొదటి సారిగా ఓటు వేయనున్నారు.
కాగా- ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దోడా జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 50 సంవత్సరాల తరువాత ఓ ప్రధానమంత్రి దోడా జిల్లా పర్యటనకు వెళ్లబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాదాన్యతను సంతరించుకుంది.
మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కేంద్రమంత్రి జితేంద్ర ప్రసాద స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు. ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశం అయ్యారు. సమస్యాత్మక ప్రాంతం కావడం వల్ల కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications