కర్ఫ్యూతో వైరస్ ను అడ్డుకోవచ్చా.. సైంటిస్టులు తేల్చిందేంటి.. వైరస్ జీవితకాలాన్ని ఎలా కనిపెట్టారు?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22)న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాలకు అనుగుణంగా దేశ ప్రజలంతా స్వచ్చందంగా కర్ఫ్యూని పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో 'కర్ఫ్యూ'పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
14గంటల పాటు కర్ఫ్యూ పాటించడం ద్వారా కరోనా వైరస్ గొలుసు తెగిపోయి.. దాని వ్యాప్తిని పూర్తిగా నియంత్రించగలుగుతామని సోషల్ మీడియాలో,ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ మెసేజ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. 14గంటల తర్వాత మనకు లభించేది సురక్షితమైన దేశమని అందులో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వాదనలో నిజమెంత.. 14గంటల కర్ఫ్యూతో వైరస్ గొలుసుకు అడ్డుకట్ట వేయగలమా.. దీనిపై నిపుణులు ఏమంటున్నారో పరిశీలిద్దాం..

మైక్రోబయాలజీ నిపుణులు ఏమంటున్నారు..
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మైక్రోబయోలాజీ హెడ్‌గా పనిచేస్తున్న డా.శోభా బ్రూర్.. ప్రజలంతా ఒకరోజు ఇళ్లకే పరిమితమవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని అనుకోవడం సరికాదన్నారు. అది అసలు విషయాన్ని మరింత సాధారణీకరించే ప్రయత్నమే అన్నారు. 14 గంటల కర్ఫ్యూ కారణంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని.. అంతే తప్ప అది పూర్తిగా వైరస్ గొలుసును అడ్డుకోలేదని తెలిపారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి 'ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్' ప్రచురించిన ఆర్టికల్‌ను ఆమె ప్రస్తావించారు. 20-22 గంటల్లో వైరస్ చనిపోవడమనేది జరగదని..ఆ ఆర్టికల్‌లో ఆధారాలతో సహా చెప్పారన్నారు. తన ఉద్దేశం ప్రకారం జనతా కర్ఫ్యూ అనేది సోషల్ డిస్టెన్స్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ ఏమంటున్నారు..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ కూడా డా.శోభా బ్రూర్ తరహాలోనే స్పందించారు. జనతా కర్ఫ్యూ అనేది వైరస్‌ని ఎదుర్కోవడానికి ఒక సన్నాహక సమయంగా తాను భావిస్తున్నట్టు చెప్పారు. అయితే వైరస్ గొలుసును అడ్డుకోవడానికి కేవలం గంటల పాటు కర్ఫ్యూ సరిపోదని,కొన్ని వారాలు,కొన్ని నెలలు కూడా పట్టవచ్చునని తెలిపారు. ఒకటి కాదు,ఎన్నో ఫార్మా సంస్థల జోక్యం అవసరమన్నారు.నిరంతర వైద్య పరీక్షలు,ఐసోలేషన్,క్వారెంటైన్,సామూహిక ఈవెంట్స్,హెల్త్ కేర్ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం,సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి చర్యల ద్వారా వైరస్‌ను నియంత్రింవచ్చునన్నారు.

మోదీ అలా చెప్పలేదు.. కానీ పవన్,వెంకయ్య నాయుడు..
14గంటల కర్ఫ్యూని పాటించడం ద్వారా వైరస్ గొలుసును అడ్డుకోవచ్చునని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అగర్వాల్.. ప్రధాని మోదీ సూచించిన కర్ఫ్యూ ద్వారా వైరస్ గొలుసును అడ్డుకోవచ్చునని చెప్పారు. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో కర్ఫ్యూ ద్వారా వైరస్ గొలుసును అరికట్టవచ్చునని చెప్పారు. వైరస్ జీవితం 12 గంటలు.. కర్ఫ్యూ 14 గంటలు కాబట్టి.. కర్ఫ్యూ తర్వాత దేశం సురక్షితంగా మారుతందని చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ తప్పుడు సమాచారం కలిగి ఉండటంతో ట్విట్టర్ మేనేజ్‌మెంట్ దాన్ని తొలగించింది. కానీ అప్పటికే ఆ ట్వీట్ వైరల్‌గా మారి చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వైరస్ జీవితకాలం.. సైంటిస్టుల జర్నల్ ఏం చెబుతోంది..
వైరస్ జీవితకాలం ఎంత అనే దానిపై అమెరికన్ సైంటిస్టులు 'ది న్యూ ఇంగ్లాడ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్' జర్నల్‌లో స్పష్టంగా వెల్లడించారు. దాని ప్రకారం కరోనా వైరస్ గాల్లో కొన్ని గంటల పాటు జీవంతో ఉంటుంది. అలాగే కొన్ని ఉపరితల ప్రాంతాల్లో 2 నుంచి 3 రోజుల వరకు ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి ఎలా దగ్గుతాడో.. అచ్చం అలాగే నెబులైజర్ ప్రక్రియ ద్వారా వైరస్‌ను గాల్లో స్ప్రే చేసి పరీక్షంచడం ద్వారా ఈ విషయాలను కనిపెట్టారు. దాని ప్రకారం కాపర్ వస్తువులపై నాలుగు గంటలు,కార్డ్ బోర్డులపై 24 గంటలు,ప్లాస్టిక్,స్టీల్ వస్తువులపై రెండు నుంచి మూడు రోజుల పాటు వైరస్ ఉంటుందని గుర్తించారు. అయితే ఫాబ్రిక్ వస్తువులపై వైరస్ ఎంతసేపు ఉండగలదు అనే దానిపై ఇంతవరకు ఎలాంటి పరిశోధన జరగలేదు.












Click it and Unblock the Notifications