జయలలిత కోసం ఆగిన 16 గుండెలు, బస్సులు దగ్ధం
చెన్నై: అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత జైలుకెళ్లడాన్ని తట్టుకోలేని ఆమె అభిమానుల గుండెలు ఆగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు జయలలితకు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడైన తర్వాత రాష్ట్రంలో 16 మంది మరణించారు.
ఆమె జైలుకెళ్లడం తట్టుకోలేని ఆమె అభిమానులు తొమ్మిది మంది గుండెపోటుతో మరణిస్తే, మరో ఐదుగురు ఆమె కోసం ఆత్మహత్య చేసుకున్నారు. జయలలిత జైలుకెళ్లిన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా ఆదివారం సాయంత్రానికి పరిస్థితి ప్రశాంతస్థితికి చేరుకుంది.

అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడక్కడా దుకాణాలు మూసివేయించారు. కొన్నిచోట్ల తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. నాగపట్నం సమీపంలో టోల్ ప్లాజా వద్ద నిలిపిన ఓ కారును దహనం చేశారు. కన్యాకుమారి జిల్లాలో కేరళ సరిహద్దుల్లో ఆందోళనకారులు వాహనాల పైన రాళ్లు రువ్వారు.
శనివారం కాంచీపురంలో బస్సు దహనం ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాగా, జైలు శిక్ష పడిన జయలలిత పదవీచ్యుతి కావడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, శాంతిభద్రతలు లోపించాయని పేర్కొంటూ మద్రాసు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి పైన కోర్టు స్టేటస్ రిపోర్టు కోరింది.












Click it and Unblock the Notifications