కళ తప్పిన 'పోయెస్ గార్డెన్'.. శశికళ నివాసం వెలవెల..
పన్నీర్ ఇంటికి పోటెత్తిన కార్యకర్తలతో ఆయన ఇల్లు కళకళలాడుతుండగా.. శశికళ నివాసముంటున్న పోయెస్ గార్డెన్ మాత్రం వచ్చిపోయెవారు లేక బోసిపోతోంది.
చెన్నై: 'పోయెస్ గార్డెన్' తమిళ రాజకీయాల్లో జయలలిత శకం ముగిసేదాకా ఆమె కార్యాచరణ అంతా ఇక్కడి నుంచే మొదలయ్యేది. వచ్చిపోయే నేతలు, పార్టీ సమాలోచనలు, కీలక నిర్ణయాలు.. ఇలా తమిళనాడువ్యాప్తంగా పోయెస్ గార్డెన్ అందరి నోళ్లల్లోను నానిపోయింది. అదే సమయంలో మన్నార్ గుడి మాఫియా ఎంట్రీతో కొన్ని వివాదాలకూ కేంద్రమైంది.
జయలలిత మరణానంతరం అదే ఇంట్లో పాగా వేసిన శశికళ ప్రస్తుతం అక్కడినుంచే అన్నాడీఎంకె రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతుండటం శశికళను కలవరానికి గురిచేస్తోంది.

అదే సమయంలో పన్నీర్ ఇంటికి పోటెత్తిన కార్యకర్తలతో ఆయన ఇల్లు కళకళలాడుతుండగా.. శశికళ నివాసముంటున్న పోయెస్ గార్డెన్ మాత్రం వచ్చిపోయెవారు లేక బోసిపోతోంది.
శశికళ తన ఎమ్మెల్యేలందరిని రిసార్టుల్లో దాచివేయడంతో పోయెస్ గార్డెన్ కు వచ్చేవారు కరువయ్యారు. ఎంపీలు సైతం ఢిల్లీలో ఉండటంతో శశికళ ఇంటికి నేతల తాకిడి లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే, పోయెస్ గార్డెన్ కు సంబంధించి వివాదం రేగుతోన్న సంగతి తెలిసిందే. శశికళ కుట్రపూరితంగా పోయెస్ గార్డెన్ ను లాగేసుకున్నారని, ఆ ఆస్తి తమకే చెందుతుందని జయలలిత బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం సైతం పోయెస్ గార్డెన్ ను అమ్మ మెమోరియల్ గా మార్చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు.












Click it and Unblock the Notifications