'దీదీ' గా ఉంటేనే బాగుంటుంది, 'దాదాగిరి'చేయాలనుకోవడం సరైంది కాదు
'దీదీ' గా ఉంటేనే బాగుంటుంది, 'దాదాగిరి'చేయాలనుకోవడం సరైంది క
పాట్నా : పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం టిఎంసి, జెడియూ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆది నుండి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థిస్తున్నారు. బీహర్ లో నిర్వహించిన ర్యాలీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మమత చేసిన ఆరోపణలపై జెడి యూ కూడ ఘాటుగానే స్పందించింది.మమత దీదీ గా ఉంటేనే బాగుంటుంది, కాని, దాదాగిరి చేయాలనుకోకూడదని జెడియూ మమతకు హితవు పలికింది. మరో వైపు పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారంపై ఎన్ డి ఏ వ్యతిరేక పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌైతున్నాయి.
పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై తనతో కలిసివచ్చే పార్టీలతో కలిసి ఆమె నిరరసన కార్యక్రమాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ విపక్షాలతో కలిసి ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించారు. కోల్ కతా వీధుల్లో ఆమె ర్యాలీ నిర్వహించారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఆమె కేంద్రంపై తన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

నితీష్ ఎందుకు సమర్థిస్తున్నాడంటే
పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొదటి నుండి సమర్థిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల నల్లధనం నిర్మూలించవవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నేపాల్ దేశం నుండి నకిలీ కరెన్సీ బీహార్ రాష్ట్రంలో విచ్చలవిడిగా రావడంతో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొన్న పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయం వల్ల బీహార్ కు ప్రయోజనం కలుగుతోందనే ఆయన విశ్వాసంతో ఉన్నారు. దరిమిలా ఈ నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తున్నారు. ఈ నిర్ణయంతో బిజెపికి ఆయన దగ్గరౌతున్నారే ప్రచారం కూడ ప్రారంభమైంది. అయితే తాను బిజెపితో చేతులు కలిపే ప్రసక్తే లేదని నితీష్ తేల్చి చెప్పారు.

నితీష్ పై మమత విమర్శలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించి , రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించే విషయంలో ఆమె సక్సెస్ అయ్యారు. మిగిలిన విషయాల్లో ఆమెతో కలిసి పనిచేసేందుకు అన్ని పార్టీలు సంసిద్దతను వ్యక్తం చేయలేదు. పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరనిస్తూ బీహార్ లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పరోక్షంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. వెన్నుపోటుదారుడని ఆయన పై విమర్శులు గుప్పించారు. విపక్షాలన్నీ ఒకతాటిపై ఉంటే నితీష్ మాత్రం వెన్నుపోటుదారుడిగా మారాడని ఆమె దుయ్యబట్టారు.

మమత పై జెడి యూ ఎదురుదాడి
బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై టిఎం సి అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శలు చేయడాన్ని జెడియూ తిప్పికొట్టింది. ' దీదీ ' రూపంలోనే మమత బాగుంటారు, కాని, ఆమె దాదాగిరీ చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని జెడియూ కూడ ఘాటుగానే స్పందించింది. టిఎంసి స్కాముల పార్టీ అని, బెంగాల్ లో చోటుచేసుకొన్న శారద, నారద కుంభకోణాలను జెడియూ నేతలు ప్రస్తావించారు.తనకు తానుగా ఆమె దాదాగా ఊహించుకోకూడదని వారు హితవు పలికారు. జెడి యూ అధికార ప్రతినిధి త్యాగి మమత వైఖరిని తప్పుబట్టారు.

ఎన్ డి ఏ వ్యతిరేక పక్షాల్లో కుదరని ఐక్యత
దేశంలోని ఎన్ డి ఏ భాగస్వామ్యంలో లేని పార్టీల నాయకత్వంలోని ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారంలో ఐక్యంగా లేరు. ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. ఎన్ డి ఏ వ్యతిరేక పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ విషయమై ఎన్ డి ఏ వ్యతిరేక ముఖ్యమంత్రులను ఏకతాటిపైకి తెచ్చేందుకు మమత బెనర్జీ చేస్తోన్న ప్రయత్నాలు ఆశించినమేరకు ఫలితాలను ఇవ్వలేదు. ఎన్ డి ఏ వ్యతిరేక పక్షాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో ఐక్యతగా ఉంటే కేంద్రంపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉండేదని మమత భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రులు , ఆయా పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడం మమతకు ఇబ్బందిగా మారింది.ఈ విషయంలో బీహార్ ముఖ్యమంత్రి కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడడం మమత శిభిరానికి నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ఆమె పరోక్షంగా నితీష్ పై విమర్శలు గుప్పించారు. జెడి యూ నేతలు కూడ ఆమెపై విమర్శలను ఎక్కుపెట్టారు.












Click it and Unblock the Notifications