డీజీపీపై వేటు: తక్షణమే తొలగింపు- కొత్త పోలీస్ బాస్ ఎవరు?
Jharkhand Assembly elecrtions 2024: దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.
మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో జరిగే ఎన్నికలతో కలిపి జార్ఖండ్‌లో పోల్ అయిన ఓట్లను లెక్కిస్తారు.
కాగా- ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలను జారీ చేసింది. జార్ఖండ్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌పై వేటు వేసింది. తాత్కాలిక డీజీపీగా వ్యవహరిస్తోన్న అనురాగ్ గుప్తాను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఆయనపై ఉన్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. మరో అధికారిని ఆ పోస్టులో నియమించాలని సూచించింది.
2019 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు అనురాగ్ గుప్తాపై ఉన్నాయి. అప్పట్లో అదనపు డైరెక్టర్ జనరల్ (స్పెషల్ బ్రాంచ్)గా ఉన్న ఆయనను బాధ్యతల నుండి తప్పించారు. ఆ తరువాత ఢిల్లీలో జార్ఖండ్ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
కాగా అనురాగ్ గుప్తాను ఈ సాయంత్రం 7 గంటలలోపు తొలగించినట్లు తమకు నివేదికను సమర్పించాల్సి ఉంటుందని ఈసీ సూచించింది. కొత్త డీజీపీ నియామకం కోసం సోమవారం ఉదయం 10 గంటలలోగా సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను పంపించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications