జార్ఖండ్ ఎన్నికలు: చంపై సహా 66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
రాంచీ: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 66 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ.. ధన్‌వార్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సరాయ్ కెలా నుంచి మాజీ సీఎం చంపై సొరెన్ బరిలో నిలుస్తున్నారు.
చంపై సొరెన్ కుమారుడు బాబులాల్ సొరెన్.. ఘట్‌శిల స్థానం నుంచి పోటీ చేయనున్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్ పెద్ద కోడలు, సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్.. జామ్‌తాడా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా జగన్నాథ్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు. మరో మాజీ సీఎం అర్జున్ ముండా సతీమణి మీరా ముండా.. పొట్కా స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా.. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ తన మిత్రపక్షాలైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10, జేడీయూ రెండు, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ ఈ పార్టీలకు ఈ మేరకు సీట్లను కేటాయించింది.
BJP releases the first list of 66 candidates for the #JharkhandElection2024
— ANI (@ANI) October 19, 2024
Party's state chief Babulal Marandi to contest from Dhanwar, Lobin Hembrom from Borio, Sita Soren from Jamtara, former CM Champai Soren from Saraikella, Geeta Balmuchu from Chaibasa, Geeta Koda from… pic.twitter.com/uXhfDpfTxq
70 చోట్ల జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తాయని సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రకటించిన గంట వ్యవధిలోనే బీజేపీ తొలి జాబితా వెలువడటం గమనార్హం. కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జేఎంఎం-కాంగ్రెస్ కూటమి గట్టిగానే ప్రయత్నిస్తోంది. కాగా, ఈ ఏడాది నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఇక్కడ పోలింగ్ జరగనుంది. 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications