కేరళ రేప్, హత్య: ప్రధాన అనుమానితుడి అరెస్ట్
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ న్యాయ విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనలో ప్రధాన అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం మీడియాకు వెల్లడించారు.
పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అసోం రాష్ట్రానికి చెందిన అమిర్ ఉల్ ఇస్లామ్ అనే వలస కూలీని అరెస్టు చేసినట్లు సీఎం విజయన్ తెలిపారు. అయితే ఇస్లామ్‌ను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు ఒకప్పుడు మృతురాలి పొరుగింట్లో ఉండేవాడని సమాచారం.

అతడితో పాటు.. మరికొందరు వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అతడి డీఎన్‌ఏ శాంపిల్స్ నివేదిక వచ్చేవరకు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో దొరికిన రక్తం మరకలైన పాదరక్షలు కూడా ఆ వ్యక్తివేనని, వాటిని అమ్మిన స్థానిక దుకాణదారు సదరు వ్యక్తిని గుర్తుపట్టాడని తెలిసింది.
ఏప్రిల్ 28న కేరళలోని ఎర్నాకులం జిల్లా పెరుంబవూర్ ప్రాంతంలో ఓ న్యాయవిద్యార్థినిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కేరళ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications