వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోషిమఠ్‌ ‘కుంగిపోతోంది’ - కుప్పకూలిన ఆలయం.. ఇళ్లు వదిలి పోతున్న జనం.. ఈ హిమాలయ నగరంలో ఏం జరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జోషిమఠ్‌

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ నగరంలో కొంతకాలంగా ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి, బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నారు.

ఇలా బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందడానికి వీల్లేని వారు తమ ఇంటి బయట బహిరంగ ప్రదేశంలోనే నిద్రిస్తున్నారు.

ఎందుకంటే ఇక్కడి ఇళ్లు బీటలు వారుతున్నాయి. రోడ్లు నిలువునా చీలిపోతున్నాయి. ఆ చీలకలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

శుక్రవారం సాయంత్రం ఒక ఆలయం కూలిపోయిందని ఎన్‌డీటీవీ తెలిపింది. దాదాపు 600 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పింది.

ప్రజలను తాత్కాలికంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.

ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ దళాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

స్థానిక ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నారు. గురువారం ఉదయం ఇక్కడి సాధారణ పౌరులు బద్రీనాథ్ హైవేను దిగ్బంధించారు. సాయంత్రం పూట మండుతున్న కాగడాలతో నిరసన ప్రదర్శనలు చేశారు.

అసలు జోషిమఠ్‌లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? అక్కడ ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో జోషిమఠ్‌కు వెళ్లిన బీబీసీ ప్రతినిధులు వినీత్ ఖరే, దీపక్ జస్రోటియా.. అక్కడ అనిశ్చిత పరిస్థితుల్లో జీవిస్తోన్న కొంతమంది నివాసితులతో మాట్లాడారు.

సునీల్ గ్రామానికి చెందిన సునయన సక్లానీ, పగుళ్లు బారిన తమ ఇంటిని బీబీసీ ప్రతినిధులకు చూపిస్తూ అక్కడి పరిస్థితి గురించి చెప్పారు.

గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల తర్వాత నుంచి క్రమక్రమంగా ఇంటికి పగుళ్లు రావడం మొదలైందని ఆమె తెలిపారు.

రవిగ్రామ్ గ్రామానికి చెందిన సుమేధ భట్ కూడా తమ గోడును బీబీసీకి వినిపించారు. ఇంటి లోపల ఉండాలంటే అనుక్షణం భయంగా ఉందని ఆమె అన్నారు. వర్షం కురవడం మొదలుకాగానే తామంతా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పారు. ఎప్పుడు ఏ క్షణాన ఇల్లు కూలిపోతుందో తెలియదు అని తెలిపారు.

జోషిమఠ్‌

నిరాశ్రయులుగా చాలా కుటుంబాలు

ఇప్పటివరకు 38 కుటుంబాలను వారి ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలను తరలించినట్లు వార్తా పత్రిక 'ది హిందూ’ తన కథనంలో పేర్కొంది.

ఈ అంశం గురించి జోషీమఠ్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ త్రిపాఠి మాట్లాడుతూ, ''గురువారం నాలుగు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. అన్ని రకాల నిర్మాణ పనులను నిలిపి వేశాం. దెబ్బతిన్న ఇళ్ల నుంచి ఇప్పటివరకు 38 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు పంపించాం’’ అని చెప్పారు.

జోషిమఠ్ కుటుంబాలు నివసించేందుకు రెండు వేల ప్రి-ఫ్యాబ్రికేటెడ్ భవనాలను నిర్మించాలని ఎన్టీపీసీ, హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ సంస్థలను జిల్లా యంత్రాంగం కోరింది.

https://twitter.com/ANINewsUP/status/1611220249034260481

తీసుకున్న చర్యలు ఏంటి?

జోషిమఠ్ నగరం నేలమట్టం అయ్యే ప్రమాదం పెరుగుతున్న కారణంగా జిల్లా యంత్రాంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ఇలాంటి చర్యలను తీసుకుంటోంది.

గత కొన్ని రోజులుగా జోషీమఠ్‌ నగరంలోని అనేక ఇళ్ల గోడలు, భవనాలకు ఏర్పడిన పగుళ్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

ఇక్కడి రోడ్లపై కూడా పగుళ్లు ఏర్పడుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

ప్రతీ గంటకు పగుళ్లు పెద్దవిగా మారుతుండటంతో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని గురువారం జోషిమఠ్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పన్వర్ అన్నారు.

రోజురోజుకీ దిగజారుతోన్న పరిస్థితుల రీత్యా జోషిమఠ్ నగరంలో ఎన్టీపీసీకి చెందిన తపోవన్ విష్ణుఘర్ హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణ పనులను నిలిపి వేశారు.

హెలాంగ్ బైపాస్ రహదారి పనులతో పాటు ఆసియాలోని అతిపెద్ద రోప్‌వే 'అలీ రోప్‌వే’ పనులను కూడా ఆపేశారు.

హడావిడిగా ఎన్టీపీసీ చేపడుతోన్న నిర్మాణాల గురించి తాము చేసిన హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని జోషిమఠ్‌లో నిరసనలు చేస్తోన్న ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

జోషిమఠ్‌

నిరసనకారుల ప్రశ్నలు

జోషిమఠ్ బచావో సంఘర్ష్ సమితి కన్వీనర్ అతుల్ సతీ ఈ అంశంపై మాట్లాడుతూ, ''మేం భూస్థాపితం అయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణ పనులను ఎందుకు నిలిపివేసింది? ముందుగా మా గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.

కేవలం జోషిమఠ్ ప్రాంతమే కాదు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతం అంతా ఇలాంటి సున్నిత భౌగోళిక పరిస్థితుల్లో ఉందని ఆయన బీబీసీకి చెప్పారు.

''ఎందుకంటే ఇక్కడి హిమాలయ పర్వతాలు చిన్నవి. కొత్తగా ఏర్పడినవి. ఇవి దుర్బలంగా, బలహీనంగా ఉంటాయి. ఇవి నిరంతరం ప్రకృతి విపత్తుల బారిన పడుతున్నాయి’’ అని ఆయన వివరించారు.

తపోవన్ విష్ణుఘర్ ప్రాజెక్టులో భాగంగా తవ్విన సొరంగం, భూమిని బోలుగా చేసిందని 'డౌన్ టు ఎర్త్’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఆయన అన్నారు.

జోషిమఠ్‌

ఈ సమస్య గురించి ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ కుమార్ సిన్హాతో కూడా బీబీసీ మాట్లాడింది.

''రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యను తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు. ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడిన వారికి ప్రత్యామ్నాయ వసతులను ఏర్పాటు చేస్తాం. ఇది ఉత్తరాఖండ్‌కు మాత్రమే కాదు, మొత్తం హిమాలయ రాష్ట్రాలకు సమస్యగా మారింది’’ అని ఆయన అన్నారు.

జోషిమఠ్‌లోని మార్వాడీ వార్డ్, రెండో నంబర్ వార్డుల్లో భూమి నుంచి బురద బయటకు రావడం చూసిన తర్వాత స్థానిక ప్రజల్లో ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. కొండపై తవ్వుతున్న సొరంగం కారణంగానే ఈ బురద బయటకు వస్తోందని ప్రజలు అనుమానిస్తున్నారు.

ఈ ప్రాంతం పరిస్థితుల గురించి జియాలజిస్ట్ ఎస్పీ సతీ అధ్యయనం చేస్తున్నారు. మార్వాడీ వార్డు నుంచి బయటకు వస్తోన్న బురద నీరు, తపోవన్‌లోని ధౌలగంగా నీటితో సరిపోలుతుందని ఆయన అన్నారు. ఎన్టీపీసీ, తపోవన్ విష్ణుఘర్ టన్నెల్ ప్రాజెక్టు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది.

జోషీమఠ్‌కు తపోవన్ 15 కి.మీ దూరంలో ఉంది. జోషీమఠ్‌కు 5 కి.మీ దూరం నుంచి టన్నెల్ ప్రారంభం అవుతుంది.

జోషిమఠ్‌

ముందు నుంచే నేలపై పగుళ్లు

స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీతో సంబంధం ఉన్న నవీన్ జుయాల్, శుభ్రా శర్మలతో కలిసి ఎస్పీ సతీ ఈ ప్రాంతంలోని నేల పగుళ్ల గురించి అధ్యయనం చేశారు.

జోషిమఠ్ చుట్టూ ఉన్న వాలు ప్రాంతాలు చాలా అస్థిరంగా మారాయని తమ నివేదికలో ఈ జియాలజిస్టుల బృందం పేర్కొంది.

హైడ్రోపవర్ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల కారణంగా ఉత్తరాఖండ్‌లో విధ్వంసం రాగలదని 2013లోనే ఆందోళనలు వ్యక్తం అయినట్లు సతీ చెప్పారు. ఈ కారణంగానే అప్పుడు ప్రాజెక్టును నిలిపేశారని వెల్లడించారు.

జోషిమఠ్ మున్సిపాలిటీ గత డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలో ఈ రకమైన విపత్తు కారణంగా 2882 మంది ప్రజలు ప్రభావితులు అవుతారని తెలిసింది.

ఇప్పటివరకు 550 ఇళ్ల పరిస్థితి అసురక్షితంగా మారిందని, అందులో 150 ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చని మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పన్వర్ చెప్పారు.

జోషిమఠ్‌

2021 ఫిబ్రవరి 7న తలెత్తిన చమోలి విపత్తు తర్వాత నీతి వ్యాలీలోని నేల మొత్తం పగుళ్ల బారిన పడింది. 2021 జూన్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాల తర్వాత 'చిప్కో’ ఉద్యమ నాయకురాలు గౌరా దేవికి చందిన రైణీ గ్రామంలో కూడా భూమి పగుళ్ల బారిన పడినట్లు వార్తలు వచ్చాయి.

1970లో కూడా జోషిమఠ్‌లో భూమి ముంపునకు గురైనట్లు తెలిపే సంఘటనలు ఉన్నాయి.

ఇక్కడ ఏర్పడుతున్న ప్రకృతి వైపరీత్యాలకు గల కారణాలను అధ్యయనం చేయడానికి గడ్వాల్ కమిషనర్ మహేశ్ మిశ్రా నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

1978లో ఈ కమిటీ తన నివేదికను ప్రచురించింది. జోషిమఠ్, నీతి వ్యాలీ, మానా వ్యాలీలు మోరెన్స్‌లపై ఏర్పడి ఉండటంతో అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు, ప్రాజెక్టులు చేపట్టకూడదని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

మోరెన్స్ అంటే హిమానీనదం కరిగిపోయిన తర్వాత ఏర్పడిన ప్రాంతం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Joshimath 'Collapses' - Collapsed temple.. People leaving their homes.. What is happening in this Himalayan city?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X