ఎవరీ జస్టిస్ బీఆర్ గవాయ్? ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం కానున్నారు. జస్టిస్ గవాయ్ నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలా నియమిస్తారు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాజ్ (2) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాన న్యాయమూర్తి కాకుండా వేరే న్యాయమూర్తి నియామకం విషయంలో ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు తప్పనిసరి.
బీఆర్ గవాయ్ నేపథ్యం?
జస్టిస్ బీఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. న్యాయవాదంలో డిగ్రీ పొందాక.. 1985లో బార్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్రలో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం పాటు ఆయన బాంబే హైకోర్టులోని నాగ్ పుర్ బెంచ్ లో పనిచేశారు. అనంతరం 2019 మే నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అయితే జస్టిస్ జీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి దళితుడు కాగా.. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న రెండో దళిత వ్యక్తిగా బీఆర్ గవాయ్ ప్రత్యేక స్థానం సంపాదించారు.

కీలక తీర్పులు..
జస్టిస్ బీఆర్ గవాయ్ తన న్యాయవాద చరిత్రలో ఎన్నో సంచలన తీర్పులు వెల్లడించారు. 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి ఐదుగురు సభ్యుల బెంచ్ లో గవాయ్ ఒకరు. ఇక 2023 లో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సభ్యుల్లో బీఆర్ గవాయ్ ఉన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్ గవాయ్ ఒకరిగా ఉన్నారు. అంతేకాక తిరుపతి లడ్డూ కల్తీ కేసులోనూ ఆయన పలు తీర్పులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications