ఆయనకు వైద్య పరీక్షలు చేయండి: సుప్రీం సంచలనం, కర్ణన్ కౌంటర్ అటాక్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం.. ఆయన మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

మే 5న కలకత్తా ప్రభుత్వాసుపత్రిలో కర్ణన్‌ను పరీక్షించి.. మే 8లోగా న్యాయస్థానానికి నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 18కి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు అవినీతిపరులంటూ జస్టిస్‌ కర్ణన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను న్యాయ సంబంధ వ్యవహారాల నుంచి తప్పించారు.

కాగా.. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం మార్చిలో విచారణ చేపట్టగా.. కర్ణన్‌ హాజరుకాలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అయితే దీనికి కూడా కర్ణన్‌ స్పందించలేదు సరికదా.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే సమన్లు జారీ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవల కూడా ప్రధానన్యాయమూర్తి సహా.. మరో ఏడుగురు న్యాయమూర్తులకు విదేశీ విమాన ప్రయాణంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు.

Justice Karnan threatens action against SC’s 'forceful' medical checkup

కర్ణన్ ఆగ్రహం

వైద్య పరీక్షలు చేయాలంటూ ఆదేశించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుపై జస్టిస్ సీఎస్ కర్ణన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మానసిక స్థితిని పరీక్షించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. మానసికంగా తాను బలహీనున్ని కాదని అన్నారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

కావాలనే తన ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని అన్నారు. దళితుడిని కాబట్టే తనను అవమానిస్తున్నారని అన్నారు. అంతేగాక, తనను ప్రశ్నిస్తున్న జడ్జీలంతా అవినీతిపరులేనని కర్ణన్ దుయ్యబట్టారు. బలవంతపు వైద్య పరీక్షలు చేపడితే సుప్రీంకోర్టు జడ్జీలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In response to the Supreme Court ordering an examination of his 'mental health', Calcutta High Court judge Justice C.S. Karnan on Monday asserted that he will issue a suo moto suspension order against West Bengal Director General of Police (DGP) if he forcefully conducts a medical checkup.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి