• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మహాలక్ష్మి

కాకినాడ ప్రాంతంలో గర్భిణిలకు వైద్యం, ప్రసవ సేవలు అందిస్తూ ఉంటుంది 'రమ్య' ఆసుపత్రి. వందల మంది మహిళలకు ఆ ఆసుపత్రికి వస్తుంటారు.

ఆ ఆసుపత్రిలోని ప్రధాన వైద్యురాలు ఏపీ ప్రభుత్వంలో కూడా పని చేస్తున్నారు. అయితే తాజాగా ఆ ఆసుపత్రి తమను మోసం చేసిందంటూ ఓ మహిళ, ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

'రమ్య ఆసుపత్రి వైద్యులు నాకు గర్భం వచ్చిందని నిర్దారించి, తొమ్మిది నెలల పాటు వైద్య సేవలు అందించారు. కానీ చివరకు నాకు గర్భమే లేదని ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరించారు' అని మహాలక్ష్మి అనే మహిళ ఆరోపించారు.

ఆమె, ఆమె బంధువులు ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళా సంఘాలు కూడా ఆమెకు అండగా వచ్చాయి. చివరకు మహాలక్ష్మి భర్త ఫిర్యాదుతో ఈ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది.

మహాలక్ష్మిని ప్రెగ్నెంట్‌గా నిర్ధారించిన టెస్టు

అసలు వివాదం ఏంటి?

తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి పెళ్లి తరువాత భర్త ఊరు అయిన యానాంలో ఉంటున్నారు. కొన్ని నెలల కిందట మహాలక్ష్మికి గర్భ సంబంధిత సమస్యలున్నాయని కాకినాడ గాంధీనగర్‌లో ఉన్న రమ్య ఆసుపత్రికి వెళ్లారు.

'మేం మొదటి నుంచి మందులు వాడుతున్నాం. ఆసుపత్రిలోనే పరీక్షలు చేసి, గర్భిణి అని తేల్చారు. నెలనెలా పరీక్షలు చేస్తూ శిశువు ఆరోగ్యంగా ఉన్నారని కూడా చెబుతూ వచ్చారు. చివరకు డెలివరీ డేట్ కూడా ఇచ్చారు.

దాంతో పురుడు కోసం పుట్టింటికి తీసుకొచ్చాం. నెలలు నిండాయి కానీ మార్పు కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చింది. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. డెలివరీ చేస్తారని అనుకుంటే అక్కడ డాక్టర్లు అసలు గర్భమే లేదని చెప్పారు. ఆమె కడుపులో బిడ్డ లేదని తేల్చారు.

మరి ఇన్నాళ్లు శిశువు పెరుగుతుందని, మందులు వాడాలని చెప్పిన సంగతి ఏమిటన్నది మాకు అర్థం కావడం లేదు' అని మహాలక్ష్మి తల్లి కమలా రాణి బీబీసీతో అన్నారు.

'ఆసుపత్రిలో పెద్ద డాక్టర్ గారే గర్భిణిగా నిర్ధారించారని, ఆ తర్వాత ఆమెకు ఖాళీ లేదని చెబుతూ ఇతర డాక్టర్లు చూసేవారు. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారి వెళ్లాం. నాటి నుంచి ప్రతి నెలా పరీక్షలు చేస్తూనే వచ్చారు. వైద్య పరీక్షలు, మందుల కోసం రూ.40 వేలు ఖర్చు చేశాం. కానీ చివరకు మాకు అన్యాయం జరిగింది' అని కమలా రాణి తెలిపారు.

గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు
గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు

అసలు విషయం ఎలా తెలిసింది?

చివరి సారిగా ఈ ఏడాది సెప్టెంబర్ 12న మహాలక్ష్మిని రమ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా బేబీ ఆరోగ్యంగా ఉందని, సెప్టెంబర్ 22న ప్రసవం జరుగుతుందని చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

డెలివరీ డేట్ ప్రకారం డెలివరీ కోసమని గోకవరం ప్రభుత్వ వైద్యశాలకు మహాలక్ష్మిని తీసుకెళ్లారు.

'ఆమె 20వ తేదీన ఆసుపత్రికి వచ్చారు. తాను గర్భిణి అన్నారు. అప్పటి వరకూ వాడిన మందుల చీటి తీసుకుని వచ్చారు. డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్చుకోవాలని కోరారు. అయితే ఆమె కడుపు చూస్తే అనుమానం వచ్చింది. దాంతో స్కానింగ్‌కు పంపాం. స్కానింగ్ రిపోర్ట్ ఆధారంగా ఆమె గర్భం దాల్చలేదని తేలింది. అదే విషయాన్ని చెప్పాం. ఆమె కడుపులో శిశువు లేదనే విషయం నిర్ధారణ కావడంతో ఆమెను వెనక్కి పంపించేశాం' అని డాక్టర్ స్రవంతి తెలిపారు.

డెలివరీ కోసమంటూ జీజీహెచ్‌లోని తల్లీబిడ్డల విభాగానికి వచ్చిన మహాలక్ష్మికి రాజమహేంద్రవరం సత్యా స్కానింగ్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

'ఆమె కడుపు సాధారణంగానే కొంత సైజు పెరగడంతో గర్భం దాల్చాననే నమ్మకం ఆమెకు కలిగింది. తన కడుపులో బిడ్డ లేదని తేలిన తర్వాత ఆమె చాలా బాధగా వెనుదిరగడం చింతించాల్సిన విషయం' అని డాక్టర్ స్రవంతి అన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ ప్రభావతి

ఆసుపత్రి ఏం చెబుతోంది?

రమ్య ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు డాక్టర్ ప్రభావతి ప్రస్తుతం ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీకి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె భర్త డాక్టర్ పితాని అన్నవరం కూడా వైఎస్సార్సీపీ వైద్యుల విభాగంలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు.

గతంలో కూడా గర్భం లేకుండానే గర్భం దాల్చినట్టు నిర్ధారించారనే ఆరోపణలు ఈ ఆసుపత్రి మీద ఉన్నాయి. పెద్దాపురం పట్టణానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం ఈ ఆసుపత్రి వద్ద ఆందోళనకు కూడా దిగింది.

'మహాలక్ష్మి గత జనవరి నుంచి మా ఆసుపత్రికి వచ్చిన మాట వాస్తవం. ఆమెకు ఇంతకు ముందు ఆగష్టులో ఓసారి గర్భం పోయింది. ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి. కానీ అత్తవారింట ఉన్న ఒత్తిడి రీత్యా తాను గర్భిణిగా చెప్పుకునే ప్రయత్నం చేసింది.

మా ఆసుపత్రికి వచ్చిన ప్రతిసారీ మేం రెగ్యులర్ మందులు రాస్తూనే స్కానింగ్ చేయించుకోవాలని చెప్పాం. ఆమె మాత్రం స్కానింగ్ చేయించుకోకుండా వచ్చి ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజం కాదు.

ఆసుపత్రికి గర్భ సంబంధిత సమస్యలతో వచ్చిన వారందరికీ ఇచ్చే ఐరన్ మాత్రలు వంటివి మాత్రమే మేం సజెస్ట్ చేశాం. ఇతర మందులు రాయలేదు' అని మీడియాకు డాక్టర్ ప్రభావతి తెలిపారు.

ఇలా ఎందుకు జరుగుతుంది?

శాస్త్రీయంగా జరిగే గర్భ నిర్ధారణ పరీక్షల్లో కొన్ని సార్లు తప్పుడు రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎం.నాయక్ అన్నారు. అయితే నెలా నెలా పరీక్షలకు వచ్చిన సమయంలో నిర్వహించే స్కానింగ్ రిపోర్టుల విషయంపై అనుమానాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

'గర్భం దాల్చారా లేదా అనే దాని కోసం నిర్వహించే పరీక్షలు చాలా తక్కువ సందర్భాల్లో భిన్నంగా వచ్చే అవకాశం ఉంది. అలాంటి కేసుల్లో మూడో నెల, ఆరో నెలలో నిర్వహించే స్కానింగ్ పరీక్షల ద్వారా స్పష్టత వస్తుంది.

అసలు గర్భంలో శిశువు లేకుండా స్కానింగ్ రిపోర్టు ఎందుకు అలా వచ్చిందన్నది పరిశీలించాలి. గర్భిణీల మానసిక, శారీరక మార్పుల విషయాన్ని సులువుగా గుర్తించే గ్రామీణ ప్రాంతంలో 9 నెలల వరకూ గర్భం గుర్తించలేదని చెప్పడం సందేహాస్పదంగా ఉంది' అని డాక్టర్ ఎం.నాయక్ అన్నారు.

'ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. అసలేం జరిగిందన్నది కేసుని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా వైద్యులు జాగ్రత్తగా ఉండాలి' అని ఆయన సూచించారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు

పోలీసు స్టేషన్‌కు చేరిన వివాదం

'నా భార్య గర్భం దాల్చకుండానే రమ్య ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన మందులు వాడిన తర్వాత ఆమె కడుపు పెరిగిపోయింది. తప్పుడు రిపోర్టులు, తప్పుడు వైద్యం అందించి మమ్మల్ని మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. నా భార్యకు ఏమైనా జరిగితే అది రమ్య ఆసుపత్రితే బాధ్యత' అని మహాలక్ష్మి భర్త వడ్డి సత్యన్నారాయణ కాకినాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాకినాడ టూటౌన్ లో రాతపూర్వకంగా అందిన ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు బీబీసీకి తెలిపారు. ప్రాథమిక సమాచారం సేకరించి చట్టపరంగా వ్యవహరిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kakinada: 'They believed that she was pregnant, when she went for delivery after nine months, they said that there was no baby in the womb'.. Complaint to the police against the private hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X