
రాజస్తాన్‌లో కుంభకర్ణుడు-ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే-ఏకబిగిన 25 రోజుల పాటు...
రామాయణంలో రావణుడి సోదరుడు కుంభకర్ణుడి గురించి వినే ఉంటాం. కుంభకర్ణుడు ఒక్కసారి కునుకు తీశాడంటే ఆర్నెళ్ల దాకా నిద్ర లేవడు. ఇది కుంభకర్ణుడికి బ్రహ్మ శాపం అని చెబుతారు. పురాణాల సంగతి పక్కనపెడితే ప్రస్తుత నిజ జీవితంలోనూ ఇలాంటి వ్యక్తి ఉన్నాడంటే నమ్మగలరా... నమ్మి తీరాల్సిందే... ఆ వ్యక్తి రాజస్తాన్‌కి చెందిన 42 ఏళ్ల పుర్ఖారామ్. ఏడాదిలో దాదాపు 300 రోజులు అతను నిద్రలోనే ఉంటాడు. ఓ అరుదైన వ్యాధి కారణంగా పుర్ఖారామ్ నిద్ర సమస్యతో బాధపడుతున్నాడు.

ఆ సమస్య కారణంగా...
రాజస్తాన్‌లోని నగౌర్ జిల్లా భద్వా పుర్ఖారామ్ స్వగ్రామం. యాక్సిస్ హైపర్‌సోమ్నియా అనే అరుదైన వ్యాధితో అతను బాధపడుతున్నాడు. మెదడులో ఉండే టీఎన్ఎస్ఎఫ్-అల్ఫా ప్రోటీన్‌లో సంభవించే హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య తలెత్తుంది. ఈ వ్యాధి కారణంగా పుర్ఖారామ్ ఎప్పుడూ నిద్రలోనే ఉంటాడు. ఒక్కసారి నిద్రలోకి జారుకున్నాడంటే ఏకబిగిన 20-25 రోజులు నిద్రే లోకం. అలా ఏడాదిలో దాదాపు 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. అందుకే స్థానికులు అతన్ని కుంభకర్ణ అని పిలుస్తుంటారు.

23 ఏళ్లుగా ఈ సమస్యతో...
గత 23 ఏళ్లుగా పుర్ఖారామ్ ఈ సమస్యతో బాధపడుతున్నాడు. ఒక్కసారి అతను నిద్రలోకి జారుకున్నాడంటే అతన్ని లేపడం ఎవరి తరం కాదు. ఈ కారణంగా కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అతనలా నిద్రిస్తుండగానే అతనికి స్నానం చేయించడం,బట్టలు మార్చడం,తినిపించడం చేస్తున్నారు. పుర్ఖారామ్‌కి భద్వా గ్రామంలో ఒక చిన్న కిరాణ షాపు కూడా ఉంది. అయితే నెలలో దాదాపు 25 రోజులు నిద్రలోనే ఉంటాడు కాబట్టి కేవలం ఐదు రోజులు మాత్రమే షాపుకు వెళ్తాడు. ఆ ఐదు రోజుల్లోనూ ఒక్కోసారి నిద్రలోకి జారుకుంటాడు.

మందులు వాడుతున్నప్పటికీ...
ఈ వ్యాధి బారినపడిన కొత్తలో పుర్ఖారామ్ రోజుకు 15 గంటలు నిద్రపోయేవాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వైద్యులను ఆశ్రయించారు. అయినప్పటికీ పుర్ఖారామ్ పరిస్థితిలో మార్పు రాలేదు. రాను రాను వ్యాధి మరింత ముదరడంతో రోజుల తరబడి నిద్రపోవడం మొదలైంది.
ఈ సమస్యపై పుర్ఖారామ్ మాట్లాడుతూ... మందులు వాడుతున్నప్పటికీ దీని నుంచి బయటపడలేకపోతున్నానని చెప్పాడు. పైగా ఎప్పుడూ అలసటగా ఉంటుందని... తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటానని తెలిపాడు. పుర్ఖారామ్ భార్య లిచిమి దేవి,తల్లి కన్వారి దేవి ఎప్పటికైనా అతని వ్యాధి నయం కాకపోదా అన్న ఆశతో ఉన్నారు.