భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీతో పాటు కమల్ హాసన్; వచ్చే ఎన్నికలకు మొదలైన సన్నాహాలు!!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు విశేషంగా మద్దతు లభిస్తుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో పాదయాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, నటుడు కమల్ హాసన్ డిసెంబర్ 24వ తేదీన ఢిల్లీలో పాదయాత్రలో భాగస్వామ్యం తీసుకోనున్నారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కమల్ హాసన్
డిసెంబర్ 18వ తేదీన జరిగిన అత్యవసర పాలకమండలి మరియు కార్యవర్గ సమావేశంలో కమల్ హాసన్ రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొనడానికి అంగీకరించినట్లు తెలిపారు ఆ పార్టీ వర్గాలు. ఢిల్లీలో తనతో కలిసి భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం తీసుకోవాలని రాహుల్ గాంధీ రాసిన లేఖ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తన ప్రయాణం రాజకీయాల్లో తీసుకుంటున్న దిశను సూచిస్తుందని కమల్ హసన్ అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొన్నారు .

వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్న కమల్ హాసన్ పార్టీ
2024 సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టినట్టు బూత్ కమిటీలను పటిష్టం చేస్తున్నట్టు, బహిరంగ కార్యక్రమాలనిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కమల్ హాసన్ పార్టీ నాయకులు ఈ మేరకు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వరకూ ప్రతినెలా ఒక ప్రధాన బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రతి జిల్లా స్థాయిలోనూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని కమల్ హాసన్ పార్టీ వర్గాలకు సూచించినట్లు సమాచారం.

కమల్ హాసన్ తో పాటు రాహుల్ యాత్రలో 5 వేల మంది మక్కల్ నీది మయ్యం పార్టీ నాయకులు
పార్టీని బలోపేతం చేయడం కోసం, వచ్చే ఎన్నికల్లో బలంగా ముందుకు వెళ్లడం కోసం అవసరమైన పొత్తుల నిర్ణయాన్ని ముందస్తుగానే తీసుకోవాలని పలువురు సీనియర్లు కమల్ హాసన్ కు సూచించినట్లు సమాచారం. ఏది ఏమైనా రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొననున్న నేపథ్యంలో కమల్ హాసన్ పార్టీ పై, భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. డిసెంబర్ 24వ తేదీన దేశ రాజధాని నగరంలో రాహుల్ గాంధీతో కలిసి కమల్ హాసన్ తో పాటు కమల్ హాసన్ పార్టీకి సంబంధించిన ఐదు వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications