జయలలితపై కమల్ వ్యాఖ్యలు...కష్టాల్లో భారతీయుడు

చెన్నై: రియాల్టీ షోలతో కొందరు సెలబ్రిటీలు తమదైన శైలిలో దూసుకుపోతుండగా... మరికొందరు ఇబ్బందుల్లో పడుతున్నారు. రేటింగ్స్ కోసం అనవసరమైన అంశాలను లేవనెత్తి లేనిపోని కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ప్రముఖ నటుడు యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ ఇరకాటంలో పడ్డాడు. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ్ రియాల్టీ షో బిగ్ బాస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జయలలిత ఒక నియంతగా పేర్కొంటూ తమిళ రియాల్టీ షోలో కమల్ వ్యాఖ్యానించి తన అభిమాన నేతను అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక టాస్క్ చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నియంతలకు ఎలాంటి గతి పట్టిందో తెలుసు కదా అంటూ కమల్ కమెంట్ చేశారు. జయలలితను ఉద్దేశించే కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో అమ్మ అభిమానులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే టాస్క్‌లో భాగంగా ఇంట్లో సభ్యుల్లో ఒకరు నియంతగా వ్యవహరించాలనే నియమాన్ని నిర్వాహకులు పెట్టారు. అదే సమయంలో అందుకున్న కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్న కమల్ హాసన్ అప్పుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తన రాజకీయ కెరీర్‌కు మంచిది కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులపై ఎక్కడా కామెంట్ చేయకూడదని కమల్ హాసన్‌కు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా కమల్ హాసన్ జాగ్రత్తగా ఉండాలని జయలలిత అభిమానులు హెచ్చరిస్తున్నారు. త్వరలో విశ్వరూపం-2తో ప్రేక్షకుల ముందుకు కమల్ రాబోతున్నాడు. త్వరలో తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ హౌజ్‌ను కూడా కమల్ సందర్శిస్తారనే వార్త ప్రచారంలో ఉంది.