అటు శివణ్ణ.. ఇటు రమ్య: రసవత్తరంగా కర్ణాటక
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార తీవ్రతను పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలో మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతోన్నారు. అటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కూడా స్టార్ క్యాస్ట్ తోడయింది. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, ఆయన భార్య గీత శివరాజ్‌కుమార్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోన్నారు. గీత శివరాజ్‌కుమార్ ఇటీవలే డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకొన్న విషయం తెలిసిందే. ఆమెకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆమె- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుతురే.
2014 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున పోటీ కూడా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సొరబ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తన సోదరుడు మధు బంగారప్ప తరఫున గీత శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మరో సోదరుడు కుమార బంగారప్ప ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిలో పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనే ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.

ఇవ్వాళ శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లిలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీతో కలిసి శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అభిమానిగా తాను ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటోన్నానని శివణ్ణ తేల్చి చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కాలినడకన నడిచారని, దేశం యావత్తు ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.
మరోవంక- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా- మండ్యలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో శాండల్‌వుడ్ నటి రమ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రియాంక గాంధీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారామె. అనంతరం మండ్యలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. అటు శివరాజ్ కుమార్, ఇటు రమ్య ఒకేరోజు, దాదాపు ఒకే సమయంలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జోష్ నింపింది.












Click it and Unblock the Notifications