జైలులో కన్నడ హీరో దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్
తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, అతడికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో జైలు పరిసరాల్లో ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరేట్ పట్టుకుని తాగుతూ కనిపించాడు దర్శన్.
దర్శన్ ప్రస్తుతం హత్య కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ ఉన్నాడు. అతనితోపాటు కొంతమంది రౌడీషీటర్ ఖైదీలు కూడా కుర్చీలో కూర్చుని ఉండటం ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఈ వారం ప్రారంభంలో బెంగళూరు కోర్టు దర్శన్ తూగదీప, పవిత్ర గౌడ తోపాటు మరో 15 మంది సహచరులకు జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 28 వరకు పొడిగించింది.

ఈ నేపథ్యంలో జైలులో ఉన్న దర్శన్‌కి వీఐపీ సౌకర్యాలు కల్పించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేణుకాస్వామి తండ్రి కాశీనాథ ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడైన ఆ నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు అందుకు అనుమతించలేదు. మాకు పోలీసులు, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యమేస్తోంది. ఇది నాకు షాకింగ్ న్యూస్. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని రేణుకా స్వామి తండ్రి వాపోయారు. దర్శన్ పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
జూన్ నెలలో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యారు. దర్శన్, పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకువచ్చి దారుణంగా కొట్టి చంపారు. జూన్ 9న బెంగళూరులోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో బాధితుడికి షాక్ ఇచ్చారని, తీవ్రంగా దాడి చేయడంతో రక్తస్రావమైందని, అతడి శరీరంపై అనేక గాయాలున్నాయని తేలింది.












Click it and Unblock the Notifications