కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ
బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. జనతాదళ్ (సెక్యులర్) ఫర్వాలేదనిపించుకుంటోంది. ప్రారంభంలో ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చనే అంచనాలు ఉన్నాయి.
కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకే దశలో పోలింగ్‌ను ముగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇవ్వాళ ఓట్ల లెక్కింపు చేపట్టింది. ఓట్లను లెక్కించడానికి రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ప్రారంభ ఫలితాల్లో ఏ పార్టీకి కూడా ఆధిక్యత లభించేలా కనిపించట్లేదు. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా పోరాడుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ 105 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీజేపీ అభ్యర్థులు 90 నియోజకవర్గాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. జేడీఎస్ 26 స్థానాల్లో ఆధిక్యతను సాధించింది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- షిగ్గావ్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య-వరుణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్-కనకపురల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. టికెట్ దక్కకపోవడం వల్ల చివరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ హుబ్లీ-ధర్వాడలో వెనుకంజలో ఉన్నారు. బీజేపీకే చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవాది- అథణి నియోజకవర్గంలో లీడింగ్‌లో ఉన్నారు.

చిక్‌బళ్లాపురాలో వైద్యారోగ్య శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి డాక్టర్ కే సుధాకర్ వెనుకంజలో ఉన్నారు. మల్లేశ్వరం అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వర్థనారాయణ ఆధిక్యతలో ఉన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 113. ప్రారంభ ఫలితాల్లో ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకునేలా కనిపించట్లేదు. ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications