కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఐదు మంది, కొత్త వారికి అవకాశం!
బెంగళూరు: కర్ణాటక విధాన పరిషత్ (ఎమ్మెల్సీ)లకు బీజేపీ ఐదు మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఈసారి కొత్తవారికి అవకాశం ఇచ్చింది. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఐదు మంది ఎమ్మెల్సీలు గెలిపించుకోవడానికి సిద్దం అయ్యింది.

బీజేపీ నాయకులు
బీజేపీ నాయకులు ఐదు మంది ఎమ్మెల్సీలను గెలిపించుకోవడానికి సిద్దం అయ్యారు. శివమొగ్గ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి చివరి వరకూ ప్రయత్నించిన ఎస్. రుద్రేగౌడ చివరికి నిరాశకు గురైనారు. రుద్రేగౌడను ఎమ్మెల్సీ చెయ్యాలని బీజేపీ నిర్ణయించింది.

కొత్త వారికి అవకాశం
బీజేపీలో ఇటీవల చేరిన ప్రముఖ జ్యువెలరీ షోరూంల యజమాని కేపీ. నంజుండికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, బీజేపీలో చేరి రామనగరలో కుమారస్వామి మీద పోటీ చేసి ఓడిపోయిన తేజస్వినీ గౌడకు బీజేపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. బీజేపీ నుంచి ఎస్. రుద్రేగౌడ, కేపీ. నంజుండి, తేజస్వినీ గౌడ, ఎన్. రవికుమార్, రఘనాథ మాలకాపుర ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నారు.

11 మంది ఎమ్మెల్సీలు
జూన్ 17వ తేదీకి 11 మంది ఎమ్మెల్సీల పదవికాలం పూర్తి అవుతుంది. ఈ సందర్బంలో జూన్ 11వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సిద్దం
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం. ఇబ్రహీం, కె. గోవిందరాజు, కె. హరీష్ కుమార్, అరవింద కుమార్ ఎస్. అరళి జూన్ 11వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం. ఇబ్రహీం, ఎంఆర్. సీతారాం, మోటమ్మ, కె గోవిందరాజుల పదవి కాలం జూన్ 17వ తేదీతో పూర్తి కానుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సీఎం. ఇబ్రహీం, కె. గోవిందరాజుకు మళ్లీ అవకాశం కల్పించింది.












Click it and Unblock the Notifications