అదో మూర్ఖపు నిబంధన... మాస్కు ధరించమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన డాక్టర్...
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అవసరమైతే ఇంట్లో కూడా మాస్కులు ధరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు,వైద్యులు డబుల్ మాస్కు ధరించాల్సిన అవసరం గురించి పదే పదే చెబుతున్నారు. అయినా సరే కొంతమంది తీరులో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా కర్ణాటకలో ఓ వ్యక్తి ముఖానికి మాస్కు ధరించకుండానే ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. మాస్కు ధరించమని స్టోర్ మేనేజర్ సూచించినందుకు అతని పైనే ఫైర్ అయ్యాడు. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే... వృత్తి రీత్యా వైద్యుడైన ఆ వ్యక్తి... నలుగురికి చెప్పాల్సింది పోయి ఆయనే మాస్కు లేకుండా తిరుగుతున్నాడు.
Recommended Video
వివరాల్లోకి వెళ్తే... ఇటీవల కర్ణాటకలోని మంగళూరులో ఓ వైద్యుడు మాస్కు ధరించకుండానే షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. అక్కడ బిల్లింగ్ చేయిస్తున్న సమయంలో తోటి కస్టమర్.. మాస్కు పెట్టుకోవాలని ఆ పెద్దాయనకు సూచించాడు. అక్కడే ఉన్న స్టోర్ మేనేజర్ కూడా మాస్కు ధరించాల్సిందిగా సూచించాడు. కానీ ఆయన మాత్రం మాస్కు ధరించేందుకు నిరాకరించాడు. పైగా అదొక మూర్ఖపు నిబంధన అంటూ కొట్టిపారేశాడు.

అంతేకాదు,ఇప్పటికే తాను కరోనా బారినపడి కోలుకున్నానని... తనవల్ల ఎవరికీ వైరస్ సంక్రమించే అవకాశం లేదని అన్నాడు. అయినా సరే,మాస్కు ధరించాల్సిందేనని... బహిరంగ ప్రదేశాల్లో అది తప్పనిసరి అని స్టోర్ మేనేజర్ సూచించాడు. ఎంతకీ అతను వినిపించుకోకపోవడంతో సదరు స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 2020 కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
'మాస్కు పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఆ వైద్యుడు వినిపించుకోలేదు. పైగా ప్రభుత్వ మార్గదర్శకాలే సరైనవి కావని కొట్టిపారేశాడు. దీంతో స్టోర్ మేనేజర్ మాకు లిఖితపూర్వకంగా అతనిపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.' అని స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
కరోనా కేసుల విషయానికి వస్తే... కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో 30,309 కేసులు నమోదయ్యాయి. 525 మంది కోవిద్ రోగులు మృతి చెందారు.మొత్తం కేసుల సంఖ్య 23,06,655కి చేరింది. కరోనా సెకండ్ వేవ్‌లో రాష్ట్రంలో 56శాతం మరణాలు 20-49 ఏళ్ల వయసున్న వారిలోనే సంభవించడం గమనార్హం. కలబుర్గిలో అంబులెన్సుల కొరత కారణంగా ఆటో రిక్షాల్లో కోవిడ్ పేషెంట్లను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 10 ఉదయం 6 గంటల నుంచి మే 24ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉండనుంది.












Click it and Unblock the Notifications