షాక్: తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇస్తాం, సీఎం సిద్దు
బెంగళూరు: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేది వరకు తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేస్తామని చెప్పారు.
మంగళవారం సిద్దరామయ్య మంత్రి వర్గంతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని మంత్రి వర్గం నిర్ణయించిందని అన్నారు.
సుప్రీం కోర్టు ఈ నెల 5వ తేదిన ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం తప్పకుండా పాటించిందని సిద్దరామయ్య చెప్పారు. సుప్రీం కోర్టు ఈనెల 20వ తేదీ వరకు ప్రతి రోజు 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటానికి మా ప్రభుత్వం సిద్దంగా ఉందని వివరించారు. చట్టాన్ని ఎవ్వరూ చేతిలోకి తీసుకోరాదని, అలా చేస్తే చూస్తూ ఊరుకోమని సిద్దరామయ్య హెచ్చరించారు.

సోమవారం పోలీసులు జరిపిన ఫైరింగ్ లో బుల్లెట్ గాయాలై ఉమేష్ గౌడ అనే యువకుడు మరణించాడని అన్నారు. అయితే అతని ప్రాణాలు తాము తిరిగి ఇవ్వలేమని, అతని కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు.
మరో యువకుడు మరణించాడని సమాచారం వచ్చిందని, అయితే ఆ యువకుడు పోలీసులు జరిపిన లాఠీచార్జ్ లో మరణించలేదని, కట్టడం మీద నుంచి కిందపడి మరణించాడని సిద్దరామయ్య అన్నారు.
కావేరీ జలాల పంపిణి విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే లేఖ రాశానని, బుధవారం తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తానని చెప్పారు. కర్ణాటకలో తమిళ ప్రజలకు భద్రత కల్పిస్తామని సిద్దరామయ్య హామీ ఇచ్చారు.
బెంగళూరు, మైసూరు నగరంతో సహ వివిధ ప్రాంతాల్లో కావేరీ తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివరించారు.












Click it and Unblock the Notifications