డీకేశి కాంప్రమైజ్: ఆ ఒక్క ఫోన్ కాల్: కడుపునొప్పి తగ్గింది- ఛలో ఢిల్లీ
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగట్లేదు. శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడి పడింది. ఆదివారం రాత్రి సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. సీఎల్పీ నేతను ఎంపిక చేసే సర్వాధికారాలను పార్టీ అధిష్ఠానానికి వదిలివేసింది. దీనితో కర్ణాటక రాజకీయాలు హస్తినకు షిఫ్ట్ అయ్యాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది. తమ నేతను ఎన్నుకోవడానికి ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయం కూడా వెలువడలేదు.

పార్టీకి ఘన విజయాన్ని అందించడానికి కృషి చేసిన సిద్ధరామయ్య- డీకే శివకుమార్‌లల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలనే విషయంపై విషయంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. 50-50 ప్రాతిపదికన ఇద్దరి పేర్లను కూడా ప్రకటిస్తే ఎలా ఉంటుదనే విషయం కూడా చర్చకు వచ్చింది గానీ దీనికి డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అంగీకరించలేదు. వారు నిర్ద్వందంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య లేదా డీకే శివకుమార్‌లల్లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై తొలుత- వన్ టు వన్‌గా శాసన సభ్యులతో చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవడానికి సీక్రెట్ బ్యాలెట్ కూడా నిర్వహించారు. ఇందులో సిద్ధరామయ్యకు 72 మంది మద్దతు పలికారు. డీకే శివకుమార్‌కు అనుకూలంగా 48 మంది ఓటు వేశారు.
ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలతో కూడిన సమగ్ర నివేదికను- ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్.. పార్టీ అధిష్ఠానానికి అందజేశారు. సీఎల్పీ సమావేశంలో చేసిన తీర్మానాన్నీ ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పంపించారు.
దీని తరువాత కర్ణాటక రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య సోమవారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డీకే శివకుమార్‌కు ఆహ్వానం ఉన్నప్పటికీ- వెళ్లలేదాయన. అలకపాన్పు ఎక్కారు. కడుపు నొప్పిగా ఉందనే కారణంతో ఢిల్లీకి వెళ్లలేదు. బెంగళూరు పద్మనాభనగరలోని తన నివాసంలోనే ఉండిపోయారు. తనకు మద్దతు పలుకుతున్న శాసన సభ్యులతో ఇంట్లోనే భేటీ అయ్యారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. డీకే శివకుమార్ నివాసానికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. పార్టీ అధిష్ఠానంతో ఫోన్‌లో మాట్లాడారు. సోమవారం రాత్రి మల్లికార్జున ఖర్గే.. డీకేకు ఫోన్ చేసిన తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఢిల్లీ వెళ్లడానికి డీకేశి ఒప్పుకొన్నారు. ఖర్గే ఫోన్ కాల్ తరువాత రాజీధోరణిలో కనిపించారు. ఈ మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications