గవర్నర్‌ను కలిసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్: 20న కొత్త ప్రభుత్వ ఏర్పాటు, కేసీఆర్‌కు ఆహ్వానం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చందర్ గెహ్లాట్.. సిద్దరామయ్యను ఆహ్వానించారు. గురువారం కాంగ్రెస్ నేతలు సీఎల్పీ నేతగా సిద్దరామయ్యను ఎన్నుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గవర్నర్‌ను కలిసేందుకు సిద్దరామయ్య, టీపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, తదితరులు రాజ్‍భవన్ వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌లను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలకు సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని కర్ణాటక కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సీఎం సిద్దరామయ్య, టీపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరూ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లింది. సుమారు నాలుగు రోజులపాటు సుదీర్ఘ మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం.. చివరకు మాజీ సీఎం సిద్దరామయ్యకే మొగ్గుచూపింది. దీంతో సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు.
ఇక కీలక నేత డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు. అయితే, పలు కీలక శాఖలను డీకేకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు టీపీసీసీ చీఫ్‌గా కూడా ఆయన కొనసాగనున్నారు. మే 20న వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించంది. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలకే పరిమితమయ్యాయి.












Click it and Unblock the Notifications