యడియూరప్ప యూటర్న్ : ఆ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా నిలిపివేత..
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల మంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రకటించిన రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను నిలిపివేశారు. బుధవారం దక్షిణ కన్నడ జిల్లాలో అధికారులతో సమావేశం అనంతరం యడియూరప్ప ఈ ప్రకటన చేశారు.
ఆ నిరసన ర్యాలీల్లో మృతి చెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎందుకంటే.. నేరస్తులకు పరిహారం చెల్లించడం క్షమించరాని నేరమవుతుందని వ్యాఖ్యానించారు. జరిగిన ఘటనపై విచారణ పూర్తయేంతవరకు ఆ రెండు మృతుల కుటుంబాలకు ఎటువంటి పరిహారం చెల్లించేది లేదన్నారు.
యడియూరప్ప యూటర్న్‌పై మాజీ ముఖ్యమంత్రి,సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దరామయ్య విమర్శలు గుప్పించారు. యడియూరప్ప వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మతపరమైన ద్వేషంతో పరిహారం నిలుపుదల చేయడం సరికాదన్నారు.

ఘటనపై విచారణ పూర్తికాలేదని,కానీ యడియూరప్ప జడ్జిలా తీర్పులు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు జరుగుతున్న సీఐడీ విచారణ పెద్ద డ్రామా అని,యడియూరప్ప వ్యాఖ్యలు చూస్తుంటే పోలీసులకు షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చింది తానే అని స్పష్టమవుతోందని ఆరోపించారు.
కాగా,ఈ నెల 19న మంగళూరులో జరిగిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అబ్దుల్ జలీల్(49),నౌషిన్ కుద్రోలి(23) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications