వీడియో: బొమ్మై-సిద్ధు భాయ్ భాయ్: భుజంపై కొట్టి విషెస్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనేది ఆ రోజున తేలిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య హోరాహోరీగా పోరు నెలకొంది.
ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయా పార్టీలన్నీ సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలో మకాం వేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇవ్వాళ వేర్వేరు జిల్లాల్లో రోడ్ షోలను నిర్వహించారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

మండ్యలో యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ బెళగావి జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు సంధించారు. అదే సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మైసూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ.. మూడు రోజులుగా కర్ణాటకలోనే ఉంటోన్నారు. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారాయన. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం ఇదే కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. సర్వశక్తులను ఒడ్డుతోంది.
#WATCH| Karnataka LoP & Congress leader Siddaramaiah meets CM Basavaraj Bommai at Belagavi airport pic.twitter.com/rCTFScdYPB
— ANI (@ANI) April 26, 2023
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా- ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఇద్దరూ ఇవ్వాళ బెళగావి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేసిన సభల్లో బొమ్మై పాల్గొనడానికి బెళగావికి వెళ్లారు. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధరామయ్య కూడా బాగల్ కోటె జిల్లాకు వెళ్లారు.
ఈ సమయంలో వారిద్దరూ బెళగావి విమానాశ్రయంలో ఎదురుపడ్డారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. బొమ్మై భుజంపై గట్టిగా చరిచారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య భుజంపై చేతులు వేసి, నవ్వుతూ మాట్లాడారు బసవరాజ్ బొమ్మై. ఇద్దరూ ఎయిర్‌పోర్ట్ లాంజ్ వైపు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications