షా నేతృత్వంలో మొదలైన బీజేపీ యాక్షన్ ప్లాన్: జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు షాకేనా?
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీని అందించకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కీలకంగా మారిన జేడీఎస్ పొత్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.
Recommended Video


కుమారస్వామికి సీఎం ఆఫర్‌తో
జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు కూడా తాము సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించడంతో జేడీఎస్ అధినేత దేవెగౌడ ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే, తమ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఉండాలని కోరారు. ఇరుపార్టీలు అంగీకారం తెలపవడంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

రంగంలోకి అమిత్ షా
అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను ప్రారంభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజా రాజకీయ పరిణామాలను గమనించి స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలిసింది.

జేడీఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్..
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బీజేపీ ఇంఛార్జీగా వ్యవహరించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్‌తో అమిత్ షా సమావేశమయ్యారు. వారి రాజకీయ వ్యూహంలో భాగంగా జేడీఎస్ పార్టీ తరపున గెలిచిన 10మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వీరు ఒక వేళ బీజేపీకి మద్దతు పలికితే మాత్రం ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.

జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు షాకే
ప్రకాశ్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డాలను బెంగళూరుకు పంపించి.. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రదించాల్సిందిగా అమిత్ షా ఆదేశించినట్లు తెలిసింది. కాగా, అమిత్ షా కూడా బెంగళూరుకు వచ్చి రాజకీయ పరిస్థితులను గమనించే అవకాశం ఉంది. ఒక వేళ బీజేపీ చేసే ప్రయత్నం విజయవంతమైతే మాత్రం జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications